Chandrababu | జగన్ నేతృత్వంలోని వైసీపీ ఐదేళ్ల పాలనపై తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా పార్టీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీది విధ్వంసంకర పాలనగా పేర్కొన్న చంద్రబాబు.. తెలుగుదేశంది అభివృద్ది మంత్రమని చెప్పారు. పేదలకు కావాల్సింది సంక్షేమనని, గొడ్డలి వేట్లు కాదని, యువతకు ఉద్యోగాలు కావాలి.. గొడ్డలిపోట్లు కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. “వేట కొడవళ్ల నుంచి గొడ్డలి పార్టీగా మారడం వారి విధానం. ఐటీ నుంచి క్వాంటం వైపు ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్” అని వ్యాఖ్యానించారు.
Read Also : సీబీఎన్ అంటే బ్రాండ్.. మహానాడులో లోకేశ్ వ్యాఖ్యలు..
టీడీపీని అడ్డుకోలేరు..
గొడ్డలి పార్టీ చేసే కుయుక్తులకు భయపడబోమని, ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీని అడ్డుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు కొనసాగించిన చంద్రబాబు.. విశాఖ రైల్వే జోన్ విషయంలో వైసీపీ నిర్లక్ష్యాన్ని ప్రస్తావించారు. “అవసరమైన భూమి కూడా ఇవ్వలేకపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే ఆ ప్రాజెక్టుకు ఊపొచ్చింది” అని అన్నారు. విద్యుత్ రంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, భారీ ఆర్థిక భారం ప్రజలపై మోపారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రూ.32వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపిందని, డిస్కమ్‌లను రూ.1.35 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపుపై నియంత్రణ తీసుకొచ్చామని, ఎన్నికలకు ముందు చార్జీలు పెంచమని హామీ ఇచ్చామని, ఈ మేరకు ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజలపై అదనపు భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
Read Also : ఏపీలో మండుతున్న ఎండలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
సురక్షితంగా భూ రికార్డులు..
రాష్ట్ర మౌలిక వసతుల పునరుద్ధరణపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. పాడైపోయిన రహదారులను మరమ్మతు చేయడంతో పాటు, పెద్దఎత్తున పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టామని చెప్పారు. భూ సమస్యలకు కారణమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, రైతుల భూమి రికార్డులు సురక్షితంగా ఉండేలా కొత్త విధానాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. నాలా చట్టాన్ని కూడా రద్దు చేసి, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఇంధన, ఆక్వా రంగాల్లో ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
Read Also : టాలీవుడ్‌కు ఏపీ నుంచే 75శాతం ఆదాయం.. బాలకృష్ట సంచలన వ్యాఖ్యలు..!
కార్యకర్తలే టీడీపీ బలం..
టీడీపీ బలం కార్యకర్తలేనని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. “తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం లాంటిది. ఇక్కడ నుంచి ఎన్నో నాయకులు తయారయ్యారు” అని అన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికే భారీగా నిధులు ఖర్చు చేశామని, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక యాప్‌ను కూడా తీసుకొచ్చామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మిత్రపక్షాలతో సమన్వయం కొనసాగిస్తూ ప్రతి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. “ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషభరితమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే మన లక్ష్యం. 2024 విజయోత్సాహాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Read Also : ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం.. విద్యుత్ భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం..!


