Nara Lokesh | తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే మహానాడు వేడుకలు బుధవారం ఘనంగా ఆరంభమయ్యాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్.. పార్టీ అధినేత చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసే నాయకుడు చంద్రబాబేనని పేర్కొన్నారు. “ప్రపంచంలో ఎక్కడికెళ్లినా సీబీఎన్ అనే మూడు అక్షరాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ పేరు ఒక బ్రాండ్‌గా మారింది. చంద్రబాబు స్పీడ్‌ను అందుకోవడం అంత సులువు కాదు. ఆయనలో ఇప్పటికీ యువ నాయకుడి ఉత్సాహం కనిపిస్తుంది. అప్పట్లో ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. హైటెక్ సిటీ నుంచి అమరావతి వరకు ప్రతి దాంట్లో ఆయన దూరదృష్టి కనిపిస్తుంది” అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
Read Also : ఏపీలో మండుతున్న ఎండలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
డ్వాక్రా సంఘాలకు ఆర్థిక బలం..
మహిళల సాధికారత విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను కూడా లోకేశ్ గుర్తుచేశారు. మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక బలం ఇచ్చారని చెప్పారు. దీపం పథకం ద్వారా పేద మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని పేర్కొన్నారు. మహిళలకు గౌరవం కల్పించిన నాయకుడు చంద్రబాబేనని, దేశంలో తొలి మహిళా స్పీకర్‌గా ప్రతిభా భారతిని నియమించిందీ టీడీపీ ప్రభుత్వమేనని తెలిపారు. టీడీపీలో కార్యకర్తకే అత్యున్నత స్థానం ఉంటుందని లోకేశ్ స్పష్టం చేశారు. 2019 నుంచి 2024 వరకు పార్టీ శ్రేణులు చేసిన పోరాటం రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. “వై నాట్ 175 అంటూ వచ్చిన వారు చివరకు టీమ్ 11గా మిగిలిపోయారు” అంటూ వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమని, వికేంద్రీకరణతో కూడిన ఒకే రాజధాని విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏపీకి భారీ పెట్టుబడులు వస్తున్నాయని, గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, ఫైటర్ జెట్ ప్రాజెక్టులు రాష్ట్రంపై ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు.
Read Also : చంద్రబాబు కాన్వాయ్‌లో కీలక మార్పులు.. కుప్పం పర్యటనలో ఏం జరిగిందం..?
వైసీపీవి గొడ్డలి రాజకీయాలు..
వైసీపీ ప్రభుత్వంపై కూడా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. “మాది గూగుల్ రాజకీయాలు అయితే వాళ్లది గొడ్డలి రాజకీయాలు. మాది పరిశ్రమలు, టెక్నాలజీ అయితే వాళ్లది ఫ్యాక్షన్ సంస్కృతి” అంటూ మండిపడ్డారు. కుటుంబ వ్యవహారాలు, రాజకీయ ఘటనలను ప్రస్తావిస్తూ జగన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని ఆరోపించిన లోకేశ్.. టీడీపీ శ్రేణులు వాటిని బలంగా తిప్పికొట్టాలని సూచించారు. విద్య, ఉపాధి అంశాల్లో తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ.. టీచర్ల నియామకాలు, జాబ్ క్యాలెండర్ విడుదల వంటి అంశాల్లో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. ఇక ముందు పార్టీ మరింత దూకుడుగా ముందుకెళ్లాలని కార్యకర్తలకు లోకేశ్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచిస్తూ.. ప్రజలతో మమేకమవ్వాలని కోరారు. “అహంకారం పార్టీని దెబ్బతీస్తుంది. ప్రజాసేవే మన లక్ష్యం కావాలి. రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం అవసరం. గుజరాత్, ఒడిశా అభివృద్ధి అందుకు ఉదాహరణ” అని అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయడం వల్లే పోలవరం, విశాఖ రైల్వే జోన్, అమరావతి అభివృద్ధి వంటి కీలక అంశాల్లో పురోగతి సాధ్యమైందని లోకేశ్ వివరించారు.
Read Also : వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే.. సంజీవని ప్రజావేదికలో చంద్రబాబు వ్యాఖ్యలు..


