AP Weather | ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడు ప్రతాపానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా చిట్యాల ప్రాంతంలో ఈ సీజన్‌లోనే అత్యధికంగా 48.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గోదావరి జిల్లాల్లో ఎండలు అత్యంత తీవ్రంగా నమోదయ్యాయి. గోపాలపురం, ఉండ్రాజవరం ప్రాంతాల్లో 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవగా, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాల్లోనూ 48.1 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోనూ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Read Also : దశాబ్దంలోనే తొలిసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఏపీలో ప్రతాపం చూపుతున్న భానుడు..!
ఏలూరు జిల్లా కుక్కునూరులో 47.3 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో 44 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు బయటకు రావడానికే ఇబ్బందిపడ్డారు. నిజాంపట్నం, కాజులూరు, మైలవరం ప్రాంతాల్లోనూ ఎండలు దంచికొట్టాయి. సోమవారం వడగాల్పుల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 166 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశముందని అంచనా వేసింది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇక విజయనగరం, మన్యం, నెల్లూరు, మార్కాపురం పరిసర ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండొచ్చని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఆకస్మిక వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని సూచించారు.


