భక్తులకు గుడ్‌న్యూస్‌.. తిరుమల తరహాలోనే ప్రముఖ ఆలయాల్లోనూ సేవ భాగ్యం..

తిరుమల శ్రీవారి సేవకులు (Srivari Seva) తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో వాలంటీర్‌ సేవలు (Volunteer Services) విస్తరించనున్నారు. విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్న, అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయాల్లో భక్తుల సౌకర్యం కోసం భారీగా వలంటీర్లను నియమించేందుకు దేవాదాయ శాఖ (Endowments Department AP) చర్యలు తీసుకుంటోంది.

Temple Volunteer | తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది. ఇదే తరహాలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లోనూ దేవీదేవతలకు సేవలు చేసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించనున్నది. విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్న, అన్నవరం సత్యనారాయణస్వామి వంటి ప్రధాన దేవాలయాలతో పాటు మరో అనేక ఆలయాల్లో వలంటీర్ల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. పండుగలు, పర్వదినాలు, ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏడు ప్రధాన దేవాలయాలు, 15 ముఖ్య ఆలయాల్లో భక్తుల రద్దీ రోజుల్లో వలంటీర్ల సేవలను వినియోగించనున్నారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా నియంత్రణ, తాగునీరు మరియు మజ్జిగ పంపిణీ, అన్నప్రసాదం వడ్డన, ఆలయ ప్రాంగణ పరిశుభ్రత, పూల అలంకరణ, హుండీ కానుకల లెక్కింపు వంటి బాధ్యతలు వలంటీర్లకు అప్పగించనున్నారు. భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను విస్తరిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Read Also : Adani Green Energy | కడపలో గౌతమ్‌ అదానీ భారీ పెట్టుబడులు.. ఏపీలో భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..!

నమోదు ప్రక్రియ ఇలా

వలంటీర్‌గా సేవ చేయాలనుకునేవారు ఆయా దేవాలయాల అధికారిక వెబ్‌సైట్లను సందర్శించి ‘వలంటీర్‌’ విభాగంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారం, ఫొటో అప్‌లోడ్‌ చేసిన తర్వాత దేవస్థానం అధికారులు వాటిని పరిశీలించి అర్హత ఉన్నవారికి గుర్తింపు కార్డు జారీ చేస్తారు. అలాగే, ఆసక్తి ఉన్నవారు నేరుగా ఆలయానికి వెళ్లి కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో వలంటీర్లుగా చేరేందుకు భారీ స్పందన కనిపిస్తోంది. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో అత్యధికంగా 14,920 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అనంతరం అన్నవరం ఆలయంలో 10,583 మంది, విజయవాడ దుర్గగుడిలో 10,283 మంది, ద్వారకాతిరుమలలో 9,386 మంది, శ్రీకాళహస్తిలో 6,122 మంది, కాణిపాకంలో 4,340 మంది, సింహాచలంలో 3,800 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం ఏడు ప్రధాన ఆలయాల పరిధిలోనే 59,704 మందికి పైగా వలంటీర్లు సేవ చేసుందుకు ముందుకు రావడం గమనార్హం. ఈ సంఖ్యను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ కనీసం 10 వేల మందికిపైగా వలంటీర్లను ప్రత్యక్ష సేవలకు ఎంపిక చేయాలని భావిస్తోంది. అదనంగా మరో 15 ముఖ్య ఆలయాల్లో ఒక్కోచోట సుమారు 5 వేల మందికి అవకాశం కల్పించే ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

Read Also : కాంగ్రెస్‌ సర్కారు తెలంగాణ గొంతు కోసేందుకు రెడీ అయ్యింది.. మాజీ మంత్రి సింగిరెడ్డి విమర్శలు..

ప్రత్యేక స్లాట్ విధానం

ఉత్సవాలు, పండుగలు, రద్దీ రోజుల్లో అవసరాన్ని బట్టి దేవస్థానాలు ముందుగానే వలంటీర్ల స్లాట్‌లను ఆలయాలు విడుదల చేస్తాయి. ఆయా స్లాట్‌ల ఆధారంగా వలంటీర్లకు సమాచారం అందుతుంది. వారు తమ అందుబాటులో ఉండే సమయాన్ని నిర్ధారించిన తర్వాత ఆ తేదీలకు అనుగుణంగా గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. వలంటీర్లకు సేవా సమయంలో ప్రత్యేక గుర్తింపు కల్పించనున్నారు. మహిళా వలంటీర్లకు కాషాయ రంగు శాలువా, పురుషులకు కండువా అందజేస్తారు. ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డును మెడలో ధరించాల్సి ఉంటుంది. దలంటీర్ల సేవల సమయంలో వారికి స్వామివారి దర్శనంతో పాటు ప్రసాదం అందజేయనున్నారు. అలాగే భోజనం, అవసరమైన సందర్భాల్లో వసతి సదుపాయాలు కూడా కల్పించనున్నారు. భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహిస్తూ, ఆలయ సేవల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఇవ్వడం ద్వారా భక్తి సేవకు కొత్త రూపం తీసుకురావాలని దేవాదాయ శాఖ భావిస్తోంది.

Read Also : ఏపీలో మండుతున్న ఎండలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »