Gold and Silver Prices:
హైదరాబాద్: పసిడి కొనుగోలుదారులకు షాకిస్తూ బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. గత కొద్ది రోజులుగా యుద్ధం కారణంగా భారీగా తగ్గుతూ వచ్చిన రేట్లు, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ముఖ్యంగా క్రూడాయిల్ ధరలు ఒక స్థిరత్వానికి రావడంతో, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లీ సురక్షితమైన ‘బంగారం’ వైపు మళ్లిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో అసలేం జరిగింది?
గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు రాత్రికి రాత్రే భారీగా ఎగబాకాయి. నిన్నటి వరకు 4,450 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ గోల్డ్ రేటు, ఒక్కసారిగా 4,600 డాలర్ల మార్కును దాటేసింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 150 డాలర్లకు పైగా పెరగడం విశేషం. దీని ప్రభావంతో వెండి ధర కూడా 68 డాలర్ల నుండి 73 డాలర్లకు చేరింది. ప్రస్తుతం రూపాయి విలువ డాలరుతో పోలిస్తే రూ. 94.61 వద్ద కొనసాగుతోంది.
దేశీయంగా పెరుగుతున్న(Gold and Silver Prices) ధరలు:
అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మన దేశంలోనూ పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్న రేట్లు, మార్చి 31 ఉదయం నాటికి ఈ క్రింది విధంగా ఉన్నాయి.
22 క్యారెట్ల బంగారం: హైదరాబాద్‌లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 1,35,900 వద్ద ఉంది.
24 క్యారెట్ల బంగారం: శుద్ధమైన బంగారం ధర 10 గ్రాములపై రూ. 170 పెరిగి రూ. 1,48,260 కు చేరుకుంది.
వెండి ధర: వెండి మాత్రం కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది. ఏకంగా రూ. 5,000 పెరగడంతో కేజీ వెండి ధర హైదరాబాద్‌లో రూ. 2.55 లక్షల వద్ద స్థిరపడింది.
పెరుగుదలకు ప్రధాన కారణాలు:
సురక్షిత పెట్టుబడి: యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు బంగారాన్ని అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు.
క్రూడాయిల్ స్థిరత్వం: గతంలో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, డాలర్ బలోపేతం అయ్యింది. దీనివల్ల బంగారం రేట్లు తగ్గాయి. ఇప్పుడు చమురు ధరలు స్థిరపడటంతో మదుపరులు మళ్లీ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
మార్కెట్ సెంటిమెంట్: గత 20 రోజుల్లో గరిష్ట స్థాయిల నుండి దాదాపు రూ. 30 వేల వరకు తగ్గిన బంగారం, ఇప్పుడు కనిష్ట స్థాయిల వద్ద ఉండటంతో భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ ధోరణులను బట్టి ఈరోజు (మార్చి 31) మధ్యాహ్నం తర్వాత దేశీయ మార్కెట్‌లో ధరలు(Gold and Silver Prices) మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

