జయం రవి-ఆర్తి వివాదంలో కొత్త ట్విస్ట్‌.. కీల‌క ఆదేశాలు జారీ చేసిన మ‌ద్రాస్ హైకోర్టు

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi), ఆయన భార్య ఆర్తి (Aarti Ravi) మధ్య కొనసాగుతున్న విడాకుల (Divorce) వివాదం మరో కీలక మలుపు తిరిగింది. పిల్లల పోషణ (Child Maintenance), స్కూల్ ఫీజులు (School Fees), మధ్యంతర భరణం (Interim Maintenance) అంశాలపై ఆర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు (Madras High Court), రెండు వారాల్లోగా కేసును పరిష్కరించాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు (Chennai Family Court)కు ఆదేశాలు జారీ చేసింది.

జయం రవి-ఆర్తి వివాదంలో కొత్త ట్విస్ట్‌.. కీల‌క ఆదేశాలు జారీ చేసిన మ‌ద్రాస్ హైకోర్టు

Jayam Ravi | తమిళ సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తి మధ్య వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. విడాకుల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పిల్లల పోషణ, విద్యా ఖర్చులకు సంబంధించిన అంశం కోర్టు ముందుకు వెళ్లగా, మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ హై-ప్రొఫైల్ కుటుంబ వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. జయం రవి నుంచి పిల్లల చ‌దువుల ఖ‌ర్చులు, రోజువారీ అవసరాలకు అవసరమైన ఆర్థిక సహాయం అందడం లేదంటూ ఆర్తి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్‌లో గత ఏడాది ఏప్రిల్ నుంచి పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఎలాంటి సాయం అందలేదని పేర్కొన్నారు. దీంతో పిల్లల చదువుతో పాటు వారి రోజువారీ అవసరాలను తీర్చడం కూడా కష్టంగా మారిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన మద్రాస్ హైకోర్టు.. సమస్యను ఎక్కువకాలం పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని సూచించింది. కేసుకు సంబంధించిన ‘మధ్యంతర భరణం’ అంశాన్ని వెంటనే పరిశీలించాలని చెన్నై కుటుంబ న్యాయస్థానానికి ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా విచారణ పూర్తిచేసి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా.. ఆర్తి చేసిన ఆరోపణలను జయం రవి వర్గం తీవ్రంగా ఖండిస్తోంది. తనపై వస్తున్న ఆరోపణల వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల గాయని కెనిషాతో తన పేరు ముడిపెట్టిన వివాదం కూడా ఈ వ్యవహారాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చింది. కెనిషా తన నుంచి దూరంగా ఉంటానని ప్రకటించిన తర్వాత ఆర్తి తనపై, తనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులపై ఒత్తిడి పెంచుతోంద‌ని జయం రవి ఆరోపించినట్లు త‌మిళ‌ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి.

జయం రవి, ఆర్తి దంపతులు చాలాకాలంగా విడిగా ఉంటున్నారని, గత కొన్ని నెలలుగా వారి మధ్య విభేదాలు బహిరంగ చర్చకు వ‌చ్చాయి. మొదట వ్యక్తిగతంగా సాగిన ఈ వివాదం ఇప్పుడు కోర్టుకెక్క‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు, వారి సంక్షేమం చుట్టూ తిరుగుతున్న ఈ కేసుపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం హైకోర్టు తాజా ఆదేశాలతో వ్యవహారం మళ్లీ ఫ్యామిలీ కోర్టు పరిధిలోకి వెళ్లింది. భరణం, పిల్లల విద్యా ఖర్చులు, సంరక్షణ బాధ్యతలపై రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. కోలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఈ సెలబ్రిటీ వివాదం ఎటువైపు మలుపు తిరుగుతుందోనని అభిమానులతో పాటు సినీ వర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »