రిచా ఘోష్ పోరాటం వృథా.. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఇంగ్లండ్ విక్ట‌రీ

మహిళల టీ20 ప్రపంచకప్ (Women’s T20 World Cup) సన్నాహక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు (India Women) పోరాడి ఓడిపోయింది. వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (Richa Ghosh) 36 బంతుల్లో 68 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినా విజ‌యం ద‌క్క‌లేదు. ఫ‌లితంగా ఇంగ్లండ్ మహిళల జట్టు (England Women's) ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.

Women’s T20 World Cup Warm-Up: England Hold Nerve to Defeat India

Women’s T20 World Cup | మహిళల టీ20 ప్రపంచకప్-2026 సన్నాహక మ్యాచ్‌లో భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. చివరి వరకు పోరాడినా ఓట‌మి త‌ప్ప‌లేదు. సోఫియా గార్డెన్స్ వేదికగా బుధవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఐదు పరుగుల తేడాతో భారత్‌ను మ‌ట్టిక‌రిపించింది. టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించ‌లేక‌పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వర్షం కారణంగా కొంతసేపు ఆటకు అంతరాయం క‌లిగించినా.. ఇంగ్లండ్ బ్యాటర్లు చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధించి భారీ స్కోరు నమోదు చేశారు.

ఓపెనర్ అమీ జోన్స్ 64 పరుగులతో జట్టుకు శుభారంభం అందించగా, కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ 57 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరూ ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశారు. చివర్లో డానియెల్ గిబ్సన్ కేవలం 12 బంతుల్లోనే 30 పరుగులు చేసి ఇంగ్లండ్ స్కోరును 170 దాటించింది. భారత్ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకుంది. అయితే, చివరి మూడు ఓవర్లలో 43 పరుగులు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రుగులు క‌ట్ట‌డి చేసి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. షెఫాలీ వర్మ 13 పరుగులు చేసి అవుట్ కాగా, స్మృతి మంధాన తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17), యస్తిక భాటియా (15) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

వరుస వికెట్లు కోల్పోతూ భారత్ ఓటమి దిశగా సాగుతున్నట్లు కనిపించింది. ఈ పరిస్థితుల్లో రిచా ఘోష్ ఒంటరి పోరాటం చేసింది. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఆమె 36 బంతుల్లో 68 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. రాధా యాదవ్‌తో కలిసి రిచా కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను మళ్లీ మ్యాచ్‌పై ప‌ట్టు సాధించింది. చివరి ఓవర్లో భారత్ విజయానికి 17 పరుగులు అవసరమైన సమయంలో రిచా ఒక ఫోర్, ఒక సిక్స్ బాదడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. చివ‌రి మూడు బంతుల్లో ఆరు పరుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. అయితే, అదే ఓవర్లో లిన్సే స్మిత్ బౌలింగ్‌లో రిచా స్టంపౌట్ కావడంతో భారత ఆశలు ఆవిరయ్యాయి. చివరి వికెట్ కూడా వెంటనే పడటంతో భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఇంగ్లండ్ జట్టు జూన్ 12న శ్రీలంకతో జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతుండగా.. భారత జట్టు ఈ నెల 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. వార్మప్ మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా రిచా ఘోష్ ఫామ్‌లోకి రావడం సానుకూల అంశంగా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »