Peddi Trolls | భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్నది. సినిమాలో హీరోయిన్ పాత్రపై విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ పాత్రకు కథలో సరైన ప్రాధాన్యం దక్కలేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో అతని నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో చరణ్ పాత్రను బలంగా మలిచిన దర్శకుడు, హీరోయిన్ పాత్ర విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్టోరీకి సంబంధం లేకుండా ఆయా సీన్స్‌ను చేర్చారంటూ సోషల్ మీడియాలో విమర్శలున్నాయి.
Read Also : రామ్‌చరణ్ ‘పెద్ది’పై భారీ అంచనాలు.. తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ కపూర్
జాన్వీ అసంతృప్తితో ఉందా?
ఈ వివాదానికి మరింత ఊతమిచ్చింది ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఒక పోస్ట్. ‘భారతీయ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్‌కు జరిగిన అత్యంత ఖరీదైన అవమానం’ అనే వ్యాఖ్యతో వచ్చిన ఆ పోస్ట్‌లో జాన్వీ పాత్రను కేవలం గ్లామర్‌కే పరిమితం చేశారని ఆరోపించారు. హీరో పాత్రకు సామాజిక నేపథ్యం, భావోద్వేగ బలం ఇచ్చిన చిత్రబృందం.. హీరోయిన్‌ను మాత్రం ప్రేమ సన్నివేశాలు, పాటల వరకే కుదించిందని అందులో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు జాన్వీ కపూర్ లైక్ చేయడం మరో చర్చకు దారితీసింది. తన పాత్ర రూపకల్పనపై ఆమెకూ అసంతృప్తి ఉందా? అనే ప్రశ్నలు సినీ అభిమానుల్లో మొదలయ్యాయి. దీనికి తోడు ప్రముఖ గాయని సుమంగళి అరియనాయగం చేసిన విమర్శలు కూడా వైరల్‌గా మారాయి. మహిళా పాత్రలను తెరపై ఎలా చూపిస్తున్నామనే అంశంపై సినీ పరిశ్రమ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
Read Also : శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్.. మూడురోజులు గర్భాలయ దర్శనాలు బంద్..!
డైరెక్టర్ బుచ్చిబాబు వివరణ..
జాన్వీ పాత్రపై వచ్చిన విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. పెద్ది మూవీకి ప్రేక్షకుల నుంచి ఇంత తీవ్ర స్థాయిలో ప్రతికూల స్పందన వస్తుందని తాను ఊహించలేదన్నారు. రామ్ చరణ్, జాన్వీ మధ్య సరదాగా సాగే ప్రేమకథను చూపించాలనేదే తమ ఉద్దేశమని చెప్పారు. అయితే, ప్రేక్షకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను గౌరవిస్తామని, భవిష్యత్తులో పాత్రల రూపకల్పనలో మరింత జాగ్రత్త వహిస్తామని పేర్కొన్నారు. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పెద్ది’లో ఒక సాధారణ కూలీ యువకుడు కుస్తీ పోటీల ద్వారా తన గ్రామానికి గుర్తింపు తీసుకురావడానికి చేసిన పోరాటాన్ని చూపించారు. భావోద్వేగాలు, క్రీడా నేపథ్యం, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజే రూ.135 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పింది. అయితే, సినిమా విజయంతో పాటు హీరోయిన్ పాత్రల ప్రాధాన్యంపై మరోసారి చర్చ మొదలుకావడం ఇండస్ట్రీలో ఆసక్తికర పరిణామంగా మారింది. ఒకవైపు వసూళ్ల పరంగా దూసుకుపోతున్న ‘పెద్ది’.. మరోవైపు హీరోయిన్ పాత్ర చుట్టూ సాగుతున్న వివాదంతో వార్తల్లో నిలుస్తోంది.
Read Also : విశాఖ రైల్వేజోన్ కల సాకారం.. జూన్ ఒకటి నుంచి అధికారంగా అమల్లోకి..


