ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న ఈ రోజుల్లో.. ఓ ప్రభుత్వ టీచర్ మాత్రం తన వినూత్న బోధనా పద్ధతులతో పాఠశాలకు విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. గేమ్స్, స్టోరీస్, ఎక్స్‌పెరిమెంట్స్‌తో పాటు యూట్యూబ్ వీడియోలను ఉపయోగిస్తూ పిల్లలకు సులభంగా పాఠాలు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. ముఖ్యంగా గణితం అంటే భయపడే విద్యార్థుల్లో ఆసక్తి పెంచుతున్నారు. ఆమె చేసిన కృషికి ఇప్పటికే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించగా.. ఇప్పుడు జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు.
40 మంది నుంచి 130 మందికి..
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గర్ల్స్ ప్రభుత్వ పాఠశాలలో బొంపల్లి భవాని ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. 2018లో ఆమె పాఠశాలలో టీచర్‌గా చేరినప్పుడు విద్యార్థుల సంఖ్య కేవలం 40గా ఉంది. ప్రస్తుతం అదే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 130కి చేరింది.
ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్న సమయంలో.. తన వినూత్న బోధనా పద్ధతులతో భవాని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రోత్సహిస్తున్నారు.
గణితం అంటే భయం పోయేలా..
చాలా మంది విద్యార్థులకు మ్యాథమెటిక్స్ అంటే భయం ఉంటుంది. అలాంటి పిల్లలకు సులభమైన టెక్నిక్స్ ద్వారా గణితాన్ని బోధిస్తున్నారు భవాని. పాఠాలతో పాటు గేమ్స్, స్టోరీస్, ఎక్స్‌పెరిమెంట్స్ ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. అవసరమైన సందర్భాల్లో యూట్యూబ్ వీడియోల సహాయం కూడా తీసుకుంటున్నారు. తాను కూడా యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటూ విద్యార్థులకు ఉపయోగపడే కంటెంట్‌ను అందిస్తున్నారు.
కోవిడ్ సమయంలో కర్ణాటక సంగీతం, భరతనాట్యం వంటి అంశాలను నేర్చుకున్న భవాని.. వాటిని కూడా విద్యార్థులకు నేర్పించడం ప్రారంభించారు.
అవార్డు డబ్బులతో స్కూల్‌కు కంప్యూటర్
భవానికి ఇప్పటికే స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు లభించింది. ఈ అవార్డులో భాగంగా రూ.10 వేల నగదు బహుమతి వచ్చింది. అయితే ఆ మొత్తాన్ని వ్యక్తిగతంగా వినియోగించుకోకుండా.. తన భర్త మరో రూ.10 వేలు కలపడంతో మొత్తం రూ.20 వేలతో పాఠశాలకు కంప్యూటర్ కొనుగోలు చేశారు.
ఇప్పుడు టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోబోతున్నారు.
ఏపీ నుంచి మరో ఉపాధ్యాయుడు..
భవానితో పాటు మరో ఇద్దరు తెలుగు ఉపాధ్యాయులు కూడా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా చిమలపేట ప్రైమరీ స్కూల్ టీచర్ కౌలూరి రాజేష్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
ఏఐని ఉపయోగించి విద్యార్థులు పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధమయ్యేలా మెటీరియల్ రూపొందించారు రాజేష్. గతంలో టెక్స్ట్ బుక్స్, ఆర్‌డ్ డిపార్ట్‌మెంట్‌లో కూడా పనిచేశారు. బోధనలో తాను కనిపెట్టిన కొత్త పద్ధతులను ప్రపంచవ్యాప్తంగా పలువురు టీచర్లు అనుసరిస్తున్నారని చెబుతున్నారు.
విద్యార్థులకు ఉపయోగపడేలా ఇంటరాక్టివ్ యాక్టివిటీస్‌తో ఒక యాప్‌ను కూడా రూపొందించారు.
మారుమూల ప్రాంతాల్లోనూ సేవలు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన మరో తెలుగు టీచర్ జల్లి ప్రకాష్ రావు. ప్రస్తుతం ఆయన అండమాన్ నికోబార్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు.
గతంలో పలు మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన ఆయన.. పట్టణాలు, నగరాల్లో విద్యార్థులకు లభించే సౌకర్యాలను మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా అందించేందుకు కృషి చేశారు.
ఆయనకు ఇప్పటికే ఏడు జిల్లా, రాష్ట్ర స్థాయి బెస్ట్ టీచర్ అవార్డులు లభించాయి. 2019 రిపబ్లిక్ డే రోజున విద్యాశాఖ శకటాన్ని ప్రదర్శించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేలా తల్లిదండ్రులను కూడా ప్రోత్సహించారు.
ఇలాంటి టీచర్లే ఆదర్శం..
విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు.. వారిలో క్రమశిక్షణ, దేశభక్తి, సమాజం పట్ల బాధ్యతను పెంచే ఉపాధ్యాయులు సమాజానికి ఎంతో అవసరం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాలను కల్పిస్తూ.. తల్లిదండ్రుల్లోనూ ప్రభుత్వ బడులపై నమ్మకాన్ని పెంచుతున్న ఇలాంటి ఉపాధ్యాయుల కృషి అభినందనీయం.