టాలీవుడ్‌లో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. హైదరాబాద్ ఫిలింనగర్ కో-ఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్‌లోని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఇప్పటికే సి.కళ్యాణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, ట్రెజరర్ తదితర ఆరు పోస్టులకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 1,200 మంది ఓటర్లు ఉన్న ఈ ఎన్నికల కోసం ప్రచారం కూడా హోరాహోరీగా సాగింది.
రెండు ప్యానళ్ల మధ్య పోటీ
ఈ ఎన్నికల్లో ప్రధానంగా ‘మన ప్యానల్’, ‘ప్రోగ్రెసివ్ ప్యానల్’ మధ్య పోటీ నెలకొంది. చిన్న సినిమా నిర్మాతలకు మద్దతుగా మన ప్యానల్ ముందుకు వస్తుండగా.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న పలువురు నిర్మాతలతో ప్రోగ్రెసివ్ ప్యానల్ బరిలోకి దిగింది.
మన ప్యానల్‌కు ఇప్పటికే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సి.కళ్యాణ్ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న సినిమాల నిర్మాతల అభ్యున్నతి, థియేటర్ల భవిష్యత్తు, టికెట్ ధరల విషయంలో ప్రభుత్వంతో సమన్వయం, నిర్మాతలకు ఆరోగ్య భద్రత వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా ఈ ప్యానల్ ముందుకు వెళ్తోంది.
మరోవైపు ప్రోగ్రెసివ్ ప్యానల్‌లో ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్న పలువురు యాక్టివ్ నిర్మాతలు ఉన్నారు. ఆరోగ్య బీమా, మహిళా నిర్మాతల రక్షణ, థియేటర్ల నిర్వహణ, నిర్మాతల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాన అంశాలుగా ప్రస్తావిస్తూ ఈ ప్యానల్ ప్రచారం నిర్వహిస్తోంది.
హోరాహోరీగా ప్రచారం
రెండు ప్యానళ్లకు చెందిన నిర్మాతలు తమ మేనిఫెస్టోలను విడుదల చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ తమ వర్గాల బలాబలాలను వివరించారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు ప్రెస్‌మీట్లు కూడా నిర్వహించారు. గతంలో నిర్మాతలకు సంబంధించిన ఆరోగ్య బీమా, ఇతర సంక్షేమ అంశాలను ప్రస్తావిస్తూ ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి.
కీలకంగా మారిన ఎన్నికలు
టాలీవుడ్‌లో నిర్మాతల మండలి ఎన్నికలు కీలకంగా మారాయి. నిర్మాతల సంక్షేమంతో పాటు సినిమా పరిశ్రమలోని మిగతా 24 క్రాఫ్ట్స్‌పై కూడా నిర్మాతల మండలి నిర్ణయాల ప్రభావం ఉంటుందనే అభిప్రాయం ఉంది.
మన ప్యానల్‌కు సి.కళ్యాణ్‌తో పాటు చేదలవాడ శ్రీనివాసరావు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న సినిమాల నిర్మాతలకు అండగా ఉండే ప్యానల్‌ను గెలిపించాలని పలువురు నిర్మాతలు కోరుతున్నారు.
మరోవైపు ప్రోగ్రెసివ్ ప్యానల్‌కు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి ప్రముఖ నిర్మాతల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తం మీద రెండు ప్యానళ్ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. నిర్మాతలు ఏ ప్యానల్‌కు పట్టం కడతారన్నది రేపటి ఎన్నికల ఫలితాలతో తేలనుంది.


