Bigg Boss Telugu 10 | బుల్లితెర ప్రేక్షకులను గత తొమ్మిది సీజన్లుగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ (BiggBoss) మరోసారి కొత్త సీజన్‌తో రాబోతోంది. ‘బిగ్‌బాస్ తెలుగు 10’ (Bigg Boss Telugu 10) త్వరలోనే ప్రారంభం కానుండగా.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ హోస్ట్ నాగార్జున (Nagarjuna) ప్రత్యేక వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఆ వీడియోలో నాగార్జున చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘బిగ్‌బాస్.. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు. ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం’ అంటూ నాగ్ డైలాగ్స్‌తో మొదలైన ఈ వీడియో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బిగ్‌బాస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాట, విజువల్స్ కూడా ఈసారి సీజన్‌పై ఆసక్తిని మరింత పెంచాయి.
ఆటే సవాల్ అంటున్న నాగ్..
‘ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్’ అన్న క్యాప్షన్‌తో విడుదలైన టీజర్ కొత్త సీజన్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోందన్న సంకేతాలు ఇస్తోంది. గత సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ‘అగ్నిపరీక్ష’ (Agnipariksha) పేరుతో నిర్వహించిన ఎంపిక ప్రక్రియ ద్వారా ఆరుగురు సామాన్యులు హౌస్‌లోకి అడుగుపెట్టి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇచ్చిన వీరిలో కల్యాణ్ పడాల విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘బిగ్‌బాస్ 10’లో కూడా సామాన్యులకు అవకాశం ఉంటుందా? లేక పూర్తిగా సెలబ్రిటీలకే పరిమితమవుతుందా? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే గత సీజన్‌లో కామన్‌మెన్లు టాస్క్‌ల్లో చూపిన ప్రతిభ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నుంచి కల్యాణ్ పడాల వరకు సామాన్యులు విజేతలుగా నిలవడం ఈ షోపై ఆసక్తిని మరింత పెంచింది.
ఈ సారి అగ్నిపరీక్ష ఉంటుందా?
అయితే, ఇక ఈసారి కూడా ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపిక ప్రక్రియ కొనసాగొచ్చని సమాచారం వినిపిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తులు, కఠినమైన ఎంపిక దశలతో కంటెస్టెంట్లను ఎంపిక చేసే అవకాశం ఉందని టాక్. గతంలో ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్‌లోకి ప్రవేశించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈసారి కొత్త సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపిక మూడు మార్గాల్లో జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సెలబ్రిటీ ఎంట్రీతో పాటు ‘అగ్నిపరీక్ష’ ద్వారా కామన్‌మన్ అవకాశం, అలాగే స్పాన్సర్ ఆధారిత ప్రత్యేక ఎంపిక విధానం కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
జడ్జీలుగా ఆ ముగ్గురు..
‘అగ్నిపరీక్ష’ సీజన్ 2కు శ్రీముఖి (Sreemukhi) హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. జడ్జీలుగా శివాజీ (Shivaji), గీతా మాధురి (Geetha Madhuri), రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో నవదీప్, బిందు మాధవి, అభిజిత్ జడ్జీలుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ షో ఆగస్టు రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ‘బిగ్‌బాస్ తెలుగు 10’ సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సారి 10 మంది సెలబ్రిటీలు, 10 మంది కామన్‌మెన్లు హౌస్‌లోకి అడుగుపెడతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


