విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ మూవీ నుంచి ఆఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది. దాదాపు 3 నిమిషాల 56 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తే సినిమా కూడా మూడు గంటలకు పైగానే ఉండబోతోందనే ఫీలింగ్ వస్తుంది. అసలు ట్రైలర్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కానంతగా.. మామూలుగా లేదు. ముఖ్యంగా బ్రిటిష్ గుత్తలో కారం బూసి కొట్టే సీన్ మాత్రం మర్చిపోలేకపోతున్నా.
ట్రైలర్‌ను చూస్తే సినిమాలో ఏదో పెద్ద పాయింట్ పెట్టబోతున్నారనే హింట్ ఇచ్చి ఇవ్వకనే ఇచ్చేశారు. ఏదో గట్టిగా ఉంటది సినిమాలో అనిపిస్తుంది. కానీ దాన్ని కూడా పూర్తిగా రివీల్ చేయకుండా ట్రైలర్‌ను కట్ చేశారు.
బుర్రకథతో మొదలైన కథ
స్టార్టింగ్‌లో బుర్రకథను చూపించారు. ఒకప్పుడు మన తాతల టైమ్‌లో బుర్రకథలు బాగా ఫేమస్. ఆ సంప్రదాయాన్ని సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.
“రెండు వందల ఏళ్ల కిందట జీవ సమాధి పొందిన అవధూత భద్రమల్లన్న స్వామి” గురించి బుర్రకథలో చెబుతారు. టీజర్‌లో లాస్ట్ షాట్‌లో చెయ్యి వచ్చి కళ్లు తీసుకుపోయే సీన్ చూపించారు కదా.. ఆ పాత్ర ఎవరో కూడా ఈ ట్రైలర్‌లో చూపించేశారు.
మన బుర్రకథల్లో రామాయణం, మహాభారతం గురించి విన్నాం. కానీ ఇక్కడ డిఫరెంట్‌గా ఓ దేవుడి గురించి, భద్రకాళి దేవుడి గురించి చెప్పే ప్రయత్నం చేశారు.
బ్రిటిషర్లపై తిరుగుబాటు
ఓ తల్లిని ఎవరో చంపడానికి వస్తారు. బ్రిటిషర్లే అనిపిస్తుంది. అక్కడే ఆమె బిడ్డను కంటుంది. “వీడు చనిపోవాల్సిన ఒక మహాకార్యం నాకు కనపడుతుంది” అనే డైలాగ్ తర్వాతే ఓ బ్రిటిష్ వ్యక్తిని అడ్డంగా నరికే సీన్ వస్తుంది.
ఇప్పటివరకు బ్రిటిషర్లు మనల్ని నరకడం చూశాం. కానీ బ్రిటిష్ వ్యక్తిని మనవాళ్లు నరకడం అనేది ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా కనిపించింది. అదే మహాకార్యం మన హీరో చేయబోతున్నాడనే విషయం అర్థమవుతుంది.
“ప్రభుత్వం వారు క్యాంపులు ఏర్పాటు చేశారు. అక్కడికి పోయి అందరూ పని చేసుకుంటే మూడు పూటలా భోజనం పెడతారు” అంటూ బ్రిటిషర్ల వ్యవస్థను చూపించారు. మూడు పూటల భోజనం కోసం ప్రజలతో పని చేయించుకోవడం, వాళ్లను దోచుకోవడం వంటి విషయాలను సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.
బ్రిటిషర్లు వేసిన రోడ్లు, రైల్వేలపై డైలాగ్
“భవిష్యత్ తరాలు బ్రిటిషర్లే మనకు రైల్వేస్ ఇచ్చారని పొగుడుతారు” అనే డైలాగ్ కూడా ఉంది.
“మనకు ట్రైన్ ఇచ్చారు సర్.. మనకు రోడ్లు వేశారు సర్” అని భవిష్యత్ తరాలు చెప్పుకుంటాయని, కానీ ఎందుకు వేశారనే విషయాన్ని కూడా ప్రశ్నించేలా డైలాగ్ ఉంది. మన దగ్గర ఉన్న సంపదను తీసుకెళ్లేందుకే వాటిని ఉపయోగించుకున్నారనే భావనను సినిమాలో చూపించారు.
బ్రిటిష్ గు** లో కారం పెట్టే సీన్
ట్రైలర్‌లో నాకు బాగా నచ్చిన షాట్ ఇదే. “బ్రిటిషోడి గు** లో కారం పెట్టి కొడతాను” అంటూ చూపించే సీన్ చాలా యూనిక్‌గా అనిపించింది.
బ్రిటిషర్లను మన హీరోలు కొట్టడం చాలా సినిమాల్లో చూశాం. కానీ వాళ్ల గు** లో కారం పెట్టి కొట్టడం మాత్రం చాలా రేర్‌గా అనిపించింది. బ్రిటిషర్లపై మనకున్న కోపాన్ని మొత్తం బయటకు తీసే ప్రయత్నం చేసినట్టుగా ఈ సీన్ కనిపించింది.
విజయ్ దేవరకొండ.. రాయలసీమ స్లాంగ్‌లో
ఇక్కడి నుంచి యాక్షన్ మొదలవుతుంది. విజయ్ దేవరకొండ రాయలసీమ స్లాంగ్‌లో తన రేంజ్ ఏంటో మరోసారి చూపించాడు. డైలాగ్ డెలివరీ, యాక్షన్ అన్నీ గట్టిగానే ఉన్నాయి.
పెళ్లి తర్వాత ఇంటి పేరు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నీదే అనే మాటలు కూడా వినిపిస్తాయి. అదే సమయంలో గుర్రానికి హీరో ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా చూపించారు.
“నన్ను చేసుకున్నావా.. గుర్రాన్ని చేసుకున్నావా?” అని హీరోయిన్ అడిగే సీన్ కూడా ఉంది. గుర్రంతో హీరోకున్న అనుబంధాన్ని ఇప్పటికే పాటల్లో చూపించారు. ఇక్కడ కూడా అదే కొనసాగించారు.
విజయ్–రష్మిక ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి కనిపించే సన్నివేశాలు ఇద్దరి అభిమానులకు ఫీస్ట్‌లానే ఉన్నాయి. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అనిపించింది.
గుర్రం చుట్టూ వచ్చే డైలాగులు, వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ట్రైలర్‌లో ప్రత్యేకంగా నిలిచాయి.
బ్రిటిషర్ల క్రూరత్వాన్ని చూపించిన సన్నివేశాలు
“పని చేయనోడికి బ్రతికే హక్కు లేదు” అంటూ ప్రజలకు తిండి పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఎండలో వదిలేయడంతో ఆకలికి, దాహానికి చనిపోయే సన్నివేశాలు కూడా చూపించారు.
అంతేకాదు.. పసిపిల్లను ఉడుకుతున్న అన్నంలో వేయడం వంటి చాలా బాధ కలిగించే సన్నివేశాలు ట్రైలర్‌లో ఉన్నాయి. స్వాతంత్ర్యం ఒక్కరోజులో రాలేదని, ఎంతో మంది బాధలు, త్యాగాల తర్వాత వచ్చిందనే విషయాన్ని సినిమాలో చూపించే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తోంది.
అఘోరాల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ట్రైలర్‌లో చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయి. అసలు ఒక్క షాట్ కూడా వదిలిపెట్టకుండా ట్రైలర్‌ను చాలా గ్రాండ్‌గా కట్ చేసినట్టుగా అనిపిస్తుంది.
‘రణబలి’గా విజయ్ దేవరకొండ
సినిమాలో విజయ్ దేవరకొండ పోషిస్తున్న పాత్ర పేరు సింగనమల రణబలి అని తెలుస్తోంది. “రణబలి” అనే పేరుతోనే సినిమాలో అతడి పాత్ర ఎంత తీవ్రంగా ఉండబోతోందో అర్థమవుతుంది.
మనకు తెలిసిన ఫ్రీడమ్ ఫైట్ కథల్లో అల్లూరి సీతారామరాజు, సైరా నరసింహారెడ్డి, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలు చూశాం. కానీ బ్రిటిషర్లపై ఇంత డిఫరెంట్‌గా తిరగబడే కాన్సెప్ట్‌ను మాత్రం ఇంతకుముందు చూడలేదనే ఫీలింగ్ వస్తుంది.
బ్రిటిషర్లు మనల్ని హింసించారు.. మనం బాధపడ్డాం. కానీ తొలిసారి వాళ్లను మనవాళ్లు హింసిస్తే ఎలా ఉంటుంది? ఒక రణబలి లాంటోడు తిరగబడితే ఎలా ఉంటుంది? ఓ దేవుడు ఉగ్రరూపం దాల్చి వాళ్లపై తిరగబడితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా సాగబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
టీజర్‌ను మించిన ట్రైలర్
దాదాపు నాలుగు నిమిషాల ట్రైలర్‌లో కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లారు. ఇంత సేపు ట్రైలర్‌ను బోర్ లేకుండా చూపించారంటే సినిమాలో ఇంకా గట్టి స్టఫ్ ఉండొచ్చనే ఫీలింగ్ వస్తుంది.
ట్రైలర్‌లోనే మొత్తం కథను చూపించకుండా ఇంకా ఏదో డిఫరెంట్‌గా సినిమాలో చూపించబోతున్నారనే నమ్మకం కలుగుతోంది. దర్శకుడు చాలా కాన్ఫిడెంట్‌గా సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది.
విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ ఎప్పటిలాగే అదరగొట్టాడు. రాయలసీమ స్లాంగ్‌లో తన రేంజ్ ఏంటో క్లియర్‌గా చూపించాడు. రష్మిక మందన్న కూడా తన పాత్రలో ఆకట్టుకుంది. వీళ్లిద్దరి కెమిస్ట్రీకి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా బ్రిటిషర్ల క్రూరత్వాన్ని చూపించిన సన్నివేశాలు, విజయ్ పాత్ర తిరుగుబాటు, యాక్షన్, రాయలసీమ స్లాంగ్, రష్మికతో కెమిస్ట్రీ.. ఇవన్నీ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.
టీజర్ ఎంత బాగుందో.. ట్రైలర్ అంతకంటే బాగుందనే ఫీలింగ్ వస్తోంది. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే అక్టోబర్ 16 వరకు వేచి చూడాల్సిందే.


