క్లీన్ అండ్ గ్రీన్‌గా ఓరుగల్లు.. మారుతున్న నగర రూపురేఖలు

వరంగల్ నగరంలో రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, జంక్షన్ల సుందరీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

warangal development
warangal development

చారిత్రాత్మక నగరం ఓరుగల్లు.. దేశ, విదేశాల నుంచి నిత్యం పర్యాటకులు వచ్చే నగరం. చారిత్రక కట్టడాలతో పాటు నగరాన్ని కూడా అందంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రోడ్లను శుభ్రంగా ఉంచడం, మురుగు నీటి కోసం సైడ్ కాలువలు నిర్మించడం, రహదారుల వెంట వీధి దీపాలు ఏర్పాటు చేయడం వంటి పనులతో పాటు ప్రధాన జంక్షన్లను సుందరీకరిస్తున్నారు. మొక్కలు నాటి గ్రీనరీ పెంచడంతో పాటు ఆకట్టుకునే కళాకృతులను ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం

రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గ్రేటర్ వరంగల్ పరిధి గతంలో 110 చదరపు కిలోమీటర్లు ఉండగా, ప్రస్తుతం 408 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. సుమారు 11 లక్షల జనాభా కలిగిన మహానగరంలో 66 డివిజన్లు ఉన్నాయి. నగరం విస్తరించడంతో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరిచే పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు సైడ్ కాలువలు ఏర్పాటు చేస్తున్నారు. రహదారులను వెడల్పు చేయడం, డివైడర్లు నిర్మించడం, ప్రధాన జంక్షన్ల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయడం వంటి పనులు చేపడుతున్నారు. రహదారుల పొడవునా స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

జంక్షన్లకు కొత్త రూపు

జంక్షన్ల సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వడ్డపల్లి చర్చ్ వరకు రోడ్ వైడనింగ్‌తో పాటు జంక్షన్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వడ్డపల్లి సెంటర్, గోకుల్ నగర్ ప్రాంతాల్లో రోడ్ వైడనింగ్, సుందరీకరణ పనులకు రూ.18 కోట్ల నిధులు మంజూరు కాగా, టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది.

హన్మకొండ చౌరస్తాను కూడా మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు. అక్కడ ఉన్న పురాతన బస్ స్టాండ్‌ను తొలగించి, జంక్షన్‌ను సుందరీకరించేలా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఫిల్టర్ బెడ్‌ స్థానంలో కొత్త నిర్మాణం

వడ్డపల్లి వద్ద నైజాం కాలంలో నిర్మించిన ఫిల్టర్ బెడ్‌ను తొలగించి, దాని స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు వచ్చినట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. నగరంలో రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, పైప్‌లైన్ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

హనుమకొండ జిల్లా రూపురేఖలు మారుతున్నాయనడానికి చేపడుతున్న అభివృద్ధి పనులే నిదర్శనమని పేర్కొన్నారు.

జంక్షన్లలో ఆకట్టుకునే కళాకృతులు

గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు జంక్షన్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఎంజీఎం ప్రాంతంలో ఏర్పాటు చేసిన కళాకృతులతో పాటు శంఖం, ఐఫెల్ టవర్ వంటి ఆకృతులు ప్రజలను ఆకట్టుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జంక్షన్‌కు ప్రత్యేక రూపాన్ని తీసుకురావడంతో పాటు గ్రీనరీకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

నగర సుందరీకరణతో పాటు పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రోడ్ల వెంట చెత్త, మట్టి, ఆకులు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, విధుల్లో అలసత్వం ప్రదర్శించినా సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మెయిన్ రోడ్లు, డివైడర్లు, రోడ్డు అంచులు ఎక్కడా చెత్త లేకుండా చూడాలని, డివైడర్లపై అనవసరమైన మొక్కల పెరుగుదల, డస్ట్ లేకుండా శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు, ఇతర కవర్లు రోడ్ల అందాన్ని దెబ్బతీయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

క్లీన్ సిటీగా మార్చడమే లక్ష్యం

వరంగల్‌ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ బాగుంటే ప్రజల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతో కమిషనర్, కలెక్టర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

అయితే నగరాన్ని కొంతకాలం మాత్రమే శుభ్రంగా ఉంచి, ఆ తర్వాత మళ్లీ నిర్లక్ష్యం చేసే పరిస్థితి రాకుండా చూడాలని వరంగల్ వాసులు కోరుతున్నారు. ప్రారంభించిన సుందరీకరణ, పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగితేనే ఓరుగల్లు నిజమైన అర్థంలో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »