హైదరాబాద్‌లో 2 కి.మీ నైట్ వాక్.. అక్టోబర్ 1న ‘ది లైట్ మార్చ్’

హైదరాబాద్‌లో అక్టోబర్ 1న TGCSB ఆధ్వర్యంలో ‘సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ – ది లైట్ మార్చ్’ నిర్వహించనున్నారు. 2 కి.మీ నైట్ వాక్, సమయం, వేదిక, రిజిస్ట్రేషన్ వివరాలు ఇవే

Cyber Security Flash, Pause for Safety
Cyber Security Flash, Pause for Safety

సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ – ది లైట్ మార్చ్’ పేరుతో అక్టోబర్ 1న హైదరాబాద్‌లో 2 కిలోమీటర్ల నైట్ వాక్ నిర్వహించనుంది. డిజిటల్ ప్రపంచంలో ఏదైనా లింక్‌పై క్లిక్ చేసే ముందు, వ్యక్తిగత వివరాలను షేర్ చేసే ముందు, ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించే ముందు కాసేపు ఆగి ఆలోచించి ధృవీకరించుకోవాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

అక్టోబర్ 1న హైదరాబాద్‌లో కార్యక్రమం

TGCSB వివరాల ప్రకారం.. అక్టోబర్ 1, 2026న సాయంత్రం 6:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. సైబర్ భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు, డిజిటల్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 2 కిలోమీటర్ల నైట్ వాక్ నిర్వహించనున్నారు.

మొబైల్ ఫ్లాష్‌లైట్‌తో నైట్ వాక్

‘ది లైట్ మార్చ్’లో పాల్గొనే వారు తమ మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేసుకుని నడవాలని నిర్వాహకులు సూచించారు. చీకటి నుంచి వెలుగు వైపు జరిగే ఈ ప్రయాణాన్ని సైబర్ అవగాహనకు ప్రతీకగా రూపొందించారు.

డిజిటల్ మోసాలు, అనుమానాస్పద లింకులు, తప్పుడు సందేశాలు, ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే అంశాన్ని ఈ కార్యక్రమంలో ప్రధానంగా ప్రచారం చేయనున్నారు.

‘క్లిక్ చేసే ముందు ఆగండి’

ఈ కార్యక్రమానికి ‘PAUSE FOR SAFETY’ అనే ప్రధాన సందేశాన్ని TGCSB తీసుకుంది. ఏదైనా లింక్‌పై క్లిక్ చేసే ముందు, సమాచారాన్ని షేర్ చేసే ముందు లేదా ఆన్‌లైన్‌లో చెల్లింపు చేసే ముందు ఆగి ఆలోచించి వివరాలను ధృవీకరించుకోవాలని ప్రజలకు సూచించనున్నారు.

ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం ద్వారా వివరించనున్నారు.

అందరికీ ఉచిత ప్రవేశం

‘ది లైట్ మార్చ్’లో పాల్గొనేందుకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదని TGCSB తెలిపింది. విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబాలు, సీనియర్ సిటిజన్లు సహా ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు TGCSB అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌లో పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్, వయసు, వృత్తి తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

సైబర్ మోసాలకు గురైతే 1930కి ఫోన్

సైబర్ మోసానికి గురైన వారు ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే cybercrime.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండటం, అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయకపోవడం, OTPలు లేదా బ్యాంకింగ్ వివరాలను ఇతరులతో పంచుకోకపోవడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా సైబర్ మోసాల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

ప్రజలకు TGCSB పిలుపు

సైబర్ భద్రతపై అవగాహనను కేవలం ఒక సందేశంగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే కార్యక్రమంగా మార్చడమే ‘ది లైట్ మార్చ్’ ఉద్దేశంగా TGCSB పేర్కొంది.

అక్టోబర్ 1న సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద జరిగే ఈ 2 కి.మీ నైట్ వాక్‌లో పాల్గొని సైబర్ భద్రతపై అవగాహన పెంచుకుందాం అనే సందేశాన్ని నిర్వాహకులు ఇస్తున్నారు.

PAUSE. THINK. VERIFY. | 1930

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »