తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉమ్మడి వరంగల్‌లో ఎడతెరిపి లేని వర్షాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్ నగరంలో కురిసిన వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి.
హనుమకొండ చౌరస్తాలోకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హనుమకొండ నుంచి ములుగు, వరంగల్ వైపు వెళ్లే మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లోనూ వర్షాలు కురిశాయి. జనగామ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది.
కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో రోడ్లు జలమయం
కరీంనగర్ జిల్లాను ముసురు వానలు వీడడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, జమ్మికుంట, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో వర్షాలు కురిశాయి. హుజురాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో భారీ వర్షం నమోదైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులు నీట మునిగాయి. బస్‌స్టాండ్, నేతన్న చౌక్, వెంకంపేట, సంజీవయ్యనగర్, ఆటోనగర్ ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
మంచిర్యాలలో వాగులు, వంకలకు వరద
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రామగుండం, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.
మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో రాకపోకలకు అంతరాయం
మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలంలో భారీ వర్షం కురిసింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధర్మారం సమీపంలోని పెద్దవాగు పొంగిపొర్లడంతో ధర్మారం–చేగుంట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వెల్దుర్తి మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీ వర్షపు నీటితో జలమయంగా మారింది. ఇళ్ల చుట్టూ వరద నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు లేకపోవడంతో కాలనీ మొత్తం బురదమయంగా మారింది.
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి నుంచి జనగామకు వెళ్లే లింక్ రోడ్డు వరద తాకిడికి దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఖమ్మం జిల్లాలో పిడుగుపాటు
ఖమ్మం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం కురిసింది. వైరా మండలం ముసలిమడుగు గ్రామంలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి గాయపడ్డారు. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌లో చదువుతున్న తన కుమార్తెను చూసేందుకు వెళ్లిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై పిడుగు పడినట్లు సమాచారం.
గాయపడిన ఆయనను గురుకుల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోనూ భారీ వర్షం
హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సికింద్రాబాద్ పరిధిలో తెల్లవారుజామున భారీ వర్షం పడింది. బోయినపల్లి, సీతారాంపురం ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సికింద్రాబాద్ ఆర్పీ రోడ్‌లోని బైబిల్ హౌస్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి కింద వరద నీరు నిలిచిపోయింది. దీంతో బ్రిడ్జి కిందుగా వెళ్తున్న పలు వాహనాలు మొరాయించాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మూసీ రిజర్వాయర్‌కు భారీగా వరద ప్రవాహం
నల్గొండ జిల్లాలోని మూసీ రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో దాదాపు 5,199 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో సుమారు 154 క్యూసెక్కులుగా కొనసాగుతున్నట్లు సమాచారం.
రిజర్వాయర్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున సూర్యాపేట, నల్గొండ జిల్లాల పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు వాగులు, నదులు, రిజర్వాయర్ల పరిసరాలకు వెళ్లవద్దని హెచ్చరించారు.
సెప్టెంబర్ 15న పలు జిల్లాల్లో ఉరుములతో వర్షాలు
సెప్టెంబర్ 15న తెలంగాణలో పగటి సమయంలో వేడి, ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. అనంతరం సాయంత్రం నుంచి రాత్రి వరకు నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సిద్దిపేట, మెదక్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములతో కూడిన వానలు పడొచ్చని అంచనా. హైదరాబాద్‌లోనూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు స్థానికంగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


