మూసీ ప్రక్షాళన ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్.. రూ.1,511 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ ప్రక్షాళన ఫేజ్-2 పనులు 100 రోజుల్లో ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రూ.1,511 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Revanth Reddy
రూ.1,511 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా నాగోల్ నుంచి గౌరెల్లి వరకు చేపట్టనున్న మూసీ ప్రక్షాళన ఫేజ్-2 పనులను వంద రోజుల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు మొదటి దశ పనులు కొనసాగుతున్నాయని, ఇప్పుడు రెండో దశ కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని స్పష్టం చేశారు.

మెడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉప్పల్ భగాయత్ ఫేజ్-3 పరిధిలో రూ.98 కోట్ల వ్యయంతో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు.

అదే కార్యక్రమంలో జిల్లాలో మొత్తం రూ.1,511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.960 కోట్లతో ఏఓసీ సెంటర్ వద్ద ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం, రూ.416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద ఆరు లేన్ల ఫ్లైఓవర్, రూ.37.50 కోట్లతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించిన  CURE-1 (Common Unified Billing and Collection System) యాప్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు.

 మూసీ ప్రక్షాళనపై సీఎం కీలక వ్యాఖ్యలు

సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గుజరాత్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్‌ఫ్రంట్, ఉత్తరప్రదేశ్‌లో గంగానది ప్రక్షాళన జరిగినప్పుడు మూసీ నదిని ఎందుకు అభివృద్ధి చేయకూడదని ప్రశ్నించారు.

55 కిలోమీటర్ల మేర మూసీ నదిని ప్రక్షాళన చేస్తే హైదరాబాద్ అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ప్రస్తుతం కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో పాటు మూసీ కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని పేర్కొన్నారు.

“ఏ పేదవాడికి అన్యాయం చేయం.. ఎవరినీ నిరాశ్రయులను చేయం. ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు ఇస్తాం. వారి పిల్లలకు మంచి విద్య అందిస్తాం” అని సీఎం హామీ ఇచ్చారు.

 హైదరాబాద్ అభివృద్ధికి మెట్రో విస్తరణ

హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలంటే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అవసరమని సీఎం పేర్కొన్నారు. నగరంలో 122 కిలోమీటర్ల మేర మెట్రో రైలు విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు.

నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ ఆసుపత్రి, రాజేంద్రనగర్ మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయం వరకు, అలాగే ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

 హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజన

తెలంగాణ విజన్-2047లో భాగంగా ఓఆర్ఆర్ లోపలి 2,100 చ.కి.మీ ప్రాంతాన్ని CURE (Core Urban Regional Economy) ప్రాంతంగా గుర్తించినట్లు సీఎం తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కార్పొరేషన్లుగా వికేంద్రీకరించినట్లు చెప్పారు.

పోలీసు వ్యవస్థను కూడా ఇదే తరహాలో వికేంద్రీకరించామని పేర్కొన్నారు. మల్కాజిగిరి అభివృద్ధికి అవసరమైన నిధులు ఎంతైనా ప్రభుత్వం అందిస్తుందని, అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »