TGPSC | తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. వరుసగా పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఈవో), గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-1 విభాగాల్లో మొత్తం 24 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గత మూడు రోజుల్లో కమిషన్ విడుదల చేసిన నాలుగో నోటిఫికేషన్ ఇదే కావడం విశేషం. ఈ పోస్టులకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 12 నుంచి ప్రారంభమై జూలై 19 వరకు కొనసాగనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
Read Also : మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40వేలు.. నరసన్నపేటలో ప్రకటించిన చంద్రబాబు..
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విద్యాశాఖ కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. పాఠశాలల పరిపాలన, విద్యా ప్రమాణాల పర్యవేక్షణలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, గెజిటెడ్ హెడ్‌మాస్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. దీంతో ఉపాధ్యాయ వర్గాలు కూడా ఈ నియామక ప్రక్రియపై ఆసక్తి కనబరుస్తున్నాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థలు డిగ్రీ, బీఈడీ పూర్తిచేయాలి. 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. అలాగే, అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏండ్ల లోపే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు ఐదు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు మూడేళ్ల చొప్పున వయోపరమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌లో పరీక్షలు జరుగుతాయి. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. దరఖాస్తుల ప్రక్రియ జూన్ 12న మొదలై.. జులై 19తో ముగుస్తుంది.
Read Also : ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. భారీగా పెట్టుబడులు పెడుతున్న ద్విచక్ర వాహనాల కంపెనీ..!
వరుస నోటిఫికేషన్లతో జోరు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల వరుసగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తూ వస్తోంది. ఇటీవల వివిధ శాఖల్లో 290 పోస్టుల భర్తీకి మూడు నోటిఫికేన్లు విడుదల చేసింది. ఇందులో రోడ్లు భవనాల శాఖలో సివిల్ విభాగంగలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు, ఎలక్ట్రికల్ విభాగంలో 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గతంలో నిలిచిపోయిన నియామక ప్రక్రియలకు మళ్లీ వేగం తీసుకురావడంతో పాటు, ఖాళీలను దశలవారీగా భర్తీ చేయాలనే లక్ష్యంతో కమిషన్ ముందుకు సాగుతోంది. ప్రతి నెలా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టీజీపీఎస్సీ వరుస ప్రకటనలు విడుదల చేస్తుండటం నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగం పుంజుకోవడంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు తాజా నోటిఫికేషన్లపై దృష్టి సారిస్తున్నారు. రానున్న నెలల్లో మరిన్ని శాఖలకు సంబంధించిన ఖాళీల పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also : గంటకు 280 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ట్రైన్ ఇదే..! బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ రివీల్..!


