Fee Reimbursement | రాష్ట్రంలో విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల పంపిణీ విధానంలో కీలక మార్పులకు సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు సంబంధించిన నిధులను ఇకపై మరింత పారదర్శకంగా, వేగంగా చెల్లించేలా కొత్త వ్యవస్థను రూపొందిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అర్హత సాధించిన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ మొత్తాలు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యం, దాని వల్ల విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు సమాచారం.
Read Also : రూ.లక్ష కోట్ల కాళేశ్వరం మూడేళ్లకే కుంగిపోయింది.. పునరుద్ధరణ పనులు ప్రారంభించాం : సీఎం రేవంత్
కొత్త విధానం ప్రకారం.. దరఖాస్తు ఆమోదం పొందిన నెల రోజుల్లోపే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయనున్నారు. అయితే, ప్రభుత్వం విడుదల చేసిన మొత్తాన్ని విద్యార్థులు వారం రోజుల్లోగా సంబంధిత కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం జరిగితే ఆ మొత్తాన్ని విద్యార్థి నుంచే తిరిగి వసూలు చేసే నిబంధనను కూడా ప్రతిపాదించారు. ఈ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ వివరాలు, విద్యార్థి విద్యా రికార్డులు ఒకేలా ఉండడం తప్పనిసరి కానుంది. అదేవిధంగా ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా తప్పనిసరి చేయనున్నారు. ఆధార్ ధ్రువీకరణ, కాలేజీ డిజిటల్ సంతకం, జిల్లా సంక్షేమ అధికారి ఆమోదం పూర్తయిన తర్వాతే నిధులు విడుదల కానున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ వ్యవస్థను మరింత వేగవంతం చేయడానికి ఈ-పాస్ పోర్టల్‌ను విద్యాశాఖ డేటాతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థుల ప్రవేశ వివరాలు, అర్హత సమాచారం తక్షణమే అందుబాటులోకి వచ్చి దరఖాస్తుల పరిశీలన వేగవంతం కానుంది. నిధుల కొరత వల్ల బకాయిలు పెరగకుండా ఉండేందుకు ప్రతి నెల సుమారు రూ.200 కోట్ల వరకు విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Read Also : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది.. స్పష్టం చేసిన పవన్ కల్యాణ్
విద్యా సంవత్సరం ముగిసేలోపు అన్ని బకాయిలు క్లియర్ అయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే కనీసం 70 శాతం హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. సంక్షేమ శాఖలతో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఈ ప్రతిపాదనలకు తుది రూపు దిద్దినట్లు తెలుస్తోంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ ఫైలుకు ఆమోదం తెలపగా, త్వరలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి ఆమోదం అనంతరం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వేలాది మంది విద్యార్థులకు ఫీజు భారం తగ్గడంతో పాటు, స్కాలర్‌షిప్‌లు సమయానికి అందే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
Read Also : ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణానికి బ్రేక్..! తెలంగాణ సర్కారు ప్రతిపాదనపై రైల్వే బోర్డు ‘నో’..!


