హైదరాబాద్: నేటి కాలంలో పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం చాలామంది నానా తంటాలు పడుతుంటారు. గంటల చొప్పున జిమ్ లో చెమట చిందించడం, ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా మానేసి పస్తులు ఉండటం వంటివి చేస్తుంటారు. అయితే, ఇలా కడుపు మార్చుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం కంటే, మనం తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాల రాజైన ‘జొన్నలు’ బరువు తగ్గించడంలో సంజీవనిలా పనిచేస్తాయి.
జొన్నలతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు:
గ్లూటెన్ రహితం: గోధుమలు, ఇతర ధాన్యాలతో పోలిస్తే జొన్నల్లో గ్లూటెన్ ఉండదు. అందువల్ల జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారికి ఇది అత్యుత్తమ ఆహారం.
అదుపులో ఆకలి: జొన్నల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని తిన్నప్పుడు పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల పదే పదే ఆహారం తీసుకోవాలనే కోరిక తగ్గి, సహజంగానే బరువు అదుపులోకి వస్తుంది.
జీర్ణక్రియకు : వీటిలో ఉండే సమృద్ధియైన పీచు పదార్థం (Fiber) మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి, జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది.
చక్కెర స్థాయిల నియంత్రణ: జొన్నలకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. అంటే, వీటిని తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఇది వరం లాంటిది.
గుండెకు మేలు: రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో జొన్నలు అద్భుతంగా తోడ్పడతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఎముకల పుష్టి: జొన్నల్లో ఉండే వివిధ రకాల ఖనిజాలు ఎముకలను దృఢంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
రోజంతా ఉత్సాహం: వీటిలో ఉండే ‘కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్’ శరీరానికి అవసరమైన శక్తిని నిలకడగా అందిస్తాయి. దీనివల్ల నీరసం రాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
జొన్నలతో ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ, ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి మీ ఆహారపు అలవాట్లలో పెద్ద మార్పులు చేసే ముందు ఒకసారి డైటీషియన్ లేదా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
