ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక మలుపు .. క‌విత‌తో పాటు మ‌రో ఇద్ద‌రికి క్లీన్‌చిట్

ఢిల్లీ మద్యం కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితలపై నమోదు చేసిన అభియోగాలను కొట్టివేస్తూ క్లీన్‌చిట్ ఇచ్చింది.

MLC Kavitha
MLC Kavitha

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ రాజధానిలో సంచలనం రేపిన ఈ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి మ‌నీష్ సిసోడియాతో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వకుంట్ల క‌విత‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది.

సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కొట్టివేస్తూ, వారిపై ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న 23 మంది పై కూడా తగిన సాక్ష్యాలు సమర్పించలేకపోయారని కోర్టు పేర్కొంది.

ఆప్‌కు భారీ ఊరట

ఢిల్లీ మద్యం విక్రయ విధానంలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో నమోదైన ఈ కేసు రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఉపశమనం లభించినట్లైంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న దర్యాప్తు, అరెస్టులు, బెయిల్ ప్రక్రియల అనంతరం వచ్చిన ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Also Read: జయలలిత నమ్మిన బంటు ఇప్పుడు స్టాలిన్ పక్షాన – ఓ పన్నీర్‌సెల్వం డీఎంకేలో చేరిక తమిళనాట పెను సంచలనం!

తీర్పు వెలువడిన అనంతరం అరవింద్ కేజ్రీవాల్ సెంట్రల్ ఢిల్లీలోని కోర్టు ప్రాంగణం వెలుపల మీడియాతో మాట్లాడారు. “సత్యం ఎప్పుడూ గెలుస్తుందని మేము చెబుతూనే ఉన్నాం. చివరికి సత్యం మావైపు నిలిచింది. మమ్మల్ని ఇంటి నుంచి బయటకు లాగి జైలులో పెట్టారు. మా మీద బురద జల్లారు. కానీ నిజం బయటపడింది,” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ తీర్పు ఢిల్లీ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ పరిణామం ఆప్‌కు బలాన్నిస్తుందా? లేక మరిన్ని చట్టపరమైన సవాళ్లు ఎదురవుతాయా? అన్నది చూడాల్సి ఉంది.

క‌విత ఎప్పుడు అరెస్ట్ అయ్యారు?

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌విత అరెస్ట్, బెయిల్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2024 మార్చి 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కవితను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అరెస్ట్ అనంతరం ఆమెను హైదరాబాద్ నుంచి ఢిల్లీలోని తీహార్ జైలుఏకు తరలించారు.

ఇక ఈడీ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న సమయంలో, 2024 ఏప్రిల్ 11న సీబీఐ కూడా ఆమెను అరెస్ట్ చేసింది. దీంతో కేసు దర్యాప్తు మరింత మలుపు తిరిగింది.

బెయిల్ ఎప్పుడు లభించింది?

తనపై నమోదైన కేసుల విషయంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం 2024 ఆగస్టు 27న ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదు నెలల పాటు జైలు జీవితం గడిపిన అనంతరం ఆమె విడుదలయ్యారు.తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ దర్యాప్తులో తగిన సాక్ష్యాలు లేవని భావించిన కోర్టు, కవితకు క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఈ కేసులో ఆమెకు పెద్ద ఉపశమనం లభించినట్లైంది. మొత్తానికి, అరెస్ట్ నుంచి బెయిల్ వరకు సాగిన ఈ ప్రయాణం రాజకీయంగా, చట్టపరంగా విస్తృత చర్చకు దారి తీసింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »