రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్న మాటకు తమిళనాడు తాజా పరిణామాలు మరోసారి అద్దం పట్టాయి. దివంగత జయలలితకు నమ్మిన బంటుగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన అన్నాడీఎంకే సీనియర్ నేత ఓ పన్నీర్‌సెల్వం శుక్రవారం అధికార డీఎంకే పార్టీలో చేరారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పదుల సంఖ్యలో మద్దతుదారులతో వచ్చిన ఓపీఎస్‌కు స్టాలిన్ ఘన స్వాగతం పలికారు.
పగ రాజుకున్న నేపథ్యం
ఈ నిర్ణయం వెనక వ్యక్తిగత అవమానం, రాజకీయ అభద్రత రెండూ ఉన్నాయి. 2022లో అన్నాడీఎంకేపై పూర్తి పట్టు సాధించిన ఎడప్పాడి పళనిస్వామి ఓపీఎస్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అంతటితో ఆగకుండా తాజాగా టీటీవీ దినకరన్‌ను ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించడం ఓపీఎస్‌కు మరింత కుంగదీత కలిగించింది. “నన్ను అవమానించిన ఈపీఎస్‌ను రాజకీయంగా దెబ్బతీయాలంటే డీఎంకే వంటి బలమైన శక్తితో చేతులు కలపడమే ఏకైక మార్గం” అని ఓపీఎస్ సన్నిహితులు వ్యాఖ్యానించారు.
#WATCH | Chennai, Tamil Nadu: Former Chief Minister and expelled AIADMK leader O. Panneerselvam joins DMK in the presence of party chief and CM MK Stalin, Deputy CM Udhyanidhi Stalin and others.
(Video: DMK) pic.twitter.com/Y4RbQMmrdp
— ANI (@ANI) February 27, 2026
డీఎంకేలో చేరే ముందు ఓపీఎస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి విడిపోయిన అన్నాడీఎంకే వర్గాలను ఏకం చేయాలని కోరారు. అయితే ఈపీఎస్ మొండివైఖరి వల్ల అది సాధ్యం కాదని తేలిపోయింది. “డీఎంకే కూటమిని ఢీకొట్టాలంటే విడిపోయిన అన్నాడీఎంకే వల్ల కాదు” అని షా స్పష్టం చేసినట్లు సమాచారం. అన్ని దారులు మూసుకుపోవడంతో స్టాలిన్‌తో రాయబారాలు నడిపి చివరకు డీఎంకేలో చేరే నిర్ణయానికి వచ్చారు. కొద్దిరోజుల క్రితమే ఓపీఎస్ అనుయాయులు ఆర్.వైతిలింగం, పాల్ మనోజ్ పాండియన్ డీఎంకేలో చేరడంతో ఈ మార్పుకు పునాది ముందే పడింది.
వచ్చే ఎన్నికల్లో ఈపీఎస్‌కు గట్టి పోటీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓపీఎస్‌కు డీఎంకే టికెట్ ఖాయమని తెలుస్తోంది. తన సొంత నియోజకవర్గమైన థేని జిల్లాలోని బోడినాయకనూర్ లేదా ఆ ప్రాంతంలోని మరో ప్రభావవంతమైన స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా దాదాపు 3.42 లక్షల ఓట్లు సాధించిన ఓపీఎస్ ఇప్పుడు డీఎంకే బలంతో రంగంలోకి దిగితే ఈపీఎస్ వర్గానికి గట్టి సవాల్ విసిరే స్థితిలో ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమ్మ అడుగు జాడల్లో నడిచిన నేత ఇప్పుడు కలైంజ్ఞర్ వారసుడి పక్షాన నిలబడటం తమిళ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జయలలిత, కరుణానిధి తరాల శత్రుత్వం తర్వాత వారి వారసత్వ పార్టీలు ఒక వేదికపై కలవడం
ఇది తమిళ రాజకీయ చరిత్రలో మర్చిపోలేని మలుపుగా నిలిచిపోనుంది.