సీఎం రేవంత్‌ హిట్లర్‌ కన్నా ఎక్కువ.. ఆయనో తాలిబన్‌.. తీవ్రస్థాయిలో మండిపడ్డ కవిత

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విలీనం (Government School Merger), విద్యా విధానం (Education Policy)పై బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర విమర్శలు చేశారు. 27 వేల పాఠశాలలను 4 వేలకు తగ్గించే ప్రతిపాదనపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విద్యా శాఖను ‘సర్కస్‌’గా మార్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై ఘాటుగా విమర్శలు గుప్పించారు.

‘Won’t Allow an Inch of Telangana Land to Be Looted’: Kavitha

Kavitha | తెలంగాణలో విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ నిర్ణయాలపై టీఆర్‌ఎస్‌ పార్టీ చీఫ్‌ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభుత్వ విద్యా విధానాన్ని లక్ష్యంగా చేసుకుని సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను కేవలం 4 వేలకే పరిమితం చేస్తామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘27 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసేసి 4 వేల పాఠశాలలు మాత్రమే నడిపిస్తాను అంటున్న రేవంత్ రెడ్డి హిట్లర్ మాత్రమే కాదు.. అంతకన్నా ఎక్కువ. ఆయన తాలిబన్’ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం ద్వారా ఆడపిల్లలు, పేద వర్గాలకు విద్యను దూరం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. ‘ఆడపిల్లలు, పేదలకు చదువులు దూరం చేసేందుకే ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తామని చెప్తున్నాడు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విద్యాశాఖ నిర్వహణపై కూడా ఆమె విమర్శలు చేశారు. ‘విద్యాశాఖను సర్కస్ లెక్క మార్చేసిండు’ అంటూ వ్యాఖ్యానించిన కవిత.. శాఖపై ముఖ్యమంత్రి నియంత్రణ కోల్పోయారని ఆరోపించారు. విద్యా రంగంలో నిర్ణయాలు గందరగోళంగా మారాయని ఆమె అన్నారు. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, తర్వాత జరిగిన పరిణామాలను కూడా ఆమె ప్రస్తావించారు. ‘ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఉండదు అని సీఎం ప్రకటించిన మరుసటి రోజే అడ్మిషన్లకు ఇంటర్ బోర్డు అడ్మిషన్లు ఇచ్చింది’ అంటూ ప్రభుత్వ విధానాల్లో సమన్వయం లేకపోవడాన్ని ఎత్తిచూపారు. జూనియర్ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడిచినా ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్లు ఇవ్వలేదని విమర్శించారు. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను కూడా గందరగోళంగా మార్చారని కవిత ఆరోపించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కొన్ని కోర్సులను సిఫారసు చేస్తే, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ వేరే కోర్సులు సూచించిందని, వాటిలో ఏ ఒక్కదానికి కూడా యూనివర్సిటీల నుంచి ఆమోదం రాలేదని ఆమె పేర్కొన్నారు.

అయినా ‘దోస్త్’ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండటాన్ని ఆమె తప్పుబట్టారు. గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘గురుకులాల్లో వంద మందికిపైగా విద్యార్థులు చనిపోయినా ఈ ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై కూడా కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండగానే, విద్యార్థులకే ట్యూషన్ ఫీజులు ఇస్తామని చెప్పి జీవో నంబర్ 7 తీసుకురావడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ జీవో వల్ల ప్రైవేటు కాలేజీలు విద్యార్థులను దోచుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జీవో నంబర్ 7ను వెంటనే రద్దు చేయాలని, అలాగే ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని ఆమె డిమాండ్ చేశారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »