ప్రధాని మోదీ పిలుపుతో రాష్ట్రాల పొదుపు మంత్రం.. సైకిల్‌పై కోర్టుకు జడ్జి, కార్యాలయానికి ఐఆర్‌ఎస్‌ అధికారి..!

అనవసర ఖర్చులు తగ్గించాలని ప్రధాని మోదీ (PM Modi) ఇచ్చిన సూచనలతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు పొదుపు చర్యలు ప్రారంభించాయి. యోగి ఆదిత్యనాథ్‌ నుంచి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వరకు పలువురు నేతలు కాన్వాయ్‌లను తగ్గించి ప్రజారవాణా వినియోగంపై దృష్టి సారిస్తున్నారు. పలువురు అధికారులు సైతం సైకిల్‌పై ఆఫీసులకు చేరుకోవడం విశేషం.

PM Modi

PM Modi | అనవసర ఖర్చులను తగ్గించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ప్రభావం యావత్‌ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు పొదుపు మంత్రాన్ని పటిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ సహా పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇప్పటికే ఖర్చులను తగ్గించడంతో పాటు ఇంధన పొదుపు పాటించడంతో పాటు ప్రజారవాణాపై దృష్టి సారించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రాష్ట్రంలో వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎక్కువగా ఉద్యోగులు ఉండే సంస్థలు వారంలో రెండు రోజులు ఇంటి నుంచే పని చేసేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర సచివాలయం, డైరెక్టరేట్‌లలో జరిగే అంతర్గత సమావేశాల్లో 50 శాతం వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఆదేశించారు. అలాగే, తన కాన్వాయ్‌తో పాటు మంత్రుల కాన్వాయ్‌ల్లో వాహనాల సంఖ్యను వెంటనే 50 శాతం తగ్గించాలని యోగి నిర్ణయించారు. అలాగే, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వారానికి కనీసం ఒకరోజైనా బస్సులు, మెట్రో వంటి ప్రజారవాణాను ఉపయోగించాలని సూచించారు. సైక్లింగ్‌, కార్‌పూలింగ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

Read Also : ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం..! కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు..!

హెలికాప్టర్‌ వాడం..

రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ సైతం కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను కుదించేందుకు నిర్ణయించారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ ఇప్పటికే కాన్వాయ్‌ని తగ్గించామని తెలిపారు. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సైతం శాఖల పనుల్లో అవసరమైనంత మాత్రమే వాహనాలను వినియోగించాలని నిర్ణయించారు. తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాధ్యమనైంత వరకు కార్‌పూలింగ్‌, ప్రజారవాణాను మాత్రమే ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఇంధన పొదుపు జాతీయ ప్రయోజనాల కోసమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రజారవాణా వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. మంత్రి ఆశిష్‌ సూద్‌ ఓ కార్యక్రమానికి మెట్రోలో బయలుదేరి.. స్టేషన్‌ నుంచి వేదికకు ఈ-రిక్షాలో చేరుకున్నారు. ప్రధాని పిలుపుతో ఐఆర్‌ఎస్‌ అధికారి, ఫిట్‌ ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌ నరేంద్ర కుమార్‌ యాదవ్‌ ప్రతిరోజు సుమారు ఎనిమిది కిలోమీటర్లు సైకిల్‌పై కార్యాలయానికి వెళ్తున్నారు. ఇబ్బందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Read Also : బండి సంజ‌య్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసు జారీ చేయాలి.. క‌విత డిమాండ్‌

మధ్యప్రదేశ్‌లో ర్యాలీలకు నో

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ పర్యటనల సమయంలో కాన్వాయ్‌లో వాహనాలు తక్కువగా ఉండాలని ఆదేశించారు. ఇకపై సీఎం పర్యటనల్లో వాహన ర్యాలీలు ఉండవని స్పష్టం చేశారు. మంత్రులు కూడా తక్కువ వాహనాలతోనే పర్యటించాలని సూచించారు. ఇదే సమయంలో జస్టిస్‌ డీడీ బన్సల్‌ సైకిల్‌పై హైకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ రాష్ట్రంలో పర్యటనల కోసం హెలికాప్టర్లు, విమానాల బదులుగా రైళ్లు, బస్సులు, ప్రజారవాణా సదుపాయాలను వినియోగిస్తానని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి హర్ష్‌ సంఘవి ఈ నెలాఖరులో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ కవీందర్‌ గుప్తా ఆదివారాన్ని ‘పెట్రోల్‌ ఫ్రీ డే’గా ప్రకటించారు. ఆ రోజు ప్రభుత్వ వాహనాలు ఇంధనం వినియోగించవని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా.. కార్యక్రమాలకు అందరూ కలిసి గ్రూప్‌గా వెళ్లాలన్నారు. తాను హెలికాప్టర్‌ వినియోగించబోనని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక పర్యటనల కోసం విమాన ప్రయాణానికి ముందస్తుగా సీఎం అనుమతి తప్పనిసరి చేసింది. సీఎం కార్యాలయం అనుమతి లేకుండా మంత్రులు విమానాల్లో ప్రయాణించరాదని రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్‌ బవాంకులే స్పష్టం చేశారు.

Read Also : భ‌విష్య‌త్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు..!

ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్‌, డీజిల్‌ వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అలాగే, దుబారా ఖర్చులను కూడా తగ్గించుకొని, పొదుపు పాటించాలని సూచించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్వాయ్‌ని తగ్గించుకున్నారు. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉపయోగించాలని సూచించారు. అయితే కొత్త వాహనాలు కొనుగోలు చేయవద్దని స్పష్టం చేశారు. సాధారణంగా ప్రధాని కాన్వాయ్‌లో 12 నుంచి 15 వాహనాలు ఉంటాయి. ఇందులో మెర్సిడెస్‌ బెంజ్‌ అంబులెన్స్‌ కూడా భాగంగా ఉంటుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌లో కేవలం రెండు వాహనాలు మాత్రమే కనిపించాయి.

 

Read Also :బడ్జెట్ 2025 ఆదాయ పన్ను స్లాబ్స్: పూర్తి వివరాలు

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »