సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కాక్రోచ్‌ జనతా పార్టీ..! పెద్ద ఎత్తున సభ్యులుగా చేరుతున్న యువత..!

‘మై భీ కాక్రోచ్’ (Mai Bhi Cockroach) నినాదంతో సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యువత సమస్యలు (Youth Issues), నిరుద్యోగం (Job Crisis), పరీక్షల గందరగోళం (Exam Issues) వంటి అంశాలను సెటైరికల్‌గా ప్రస్తావిస్తూ ఈ ఆన్‌లైన్ ఉద్యమం లక్షలాది మందిని ఆకర్షిస్తోంది.

Cockroach Janata Party | సోషల్ మీడియా యుగంలో ఒక్క వ్యాఖ్య సైతం తీవ్రమైన చర్చకు దారి తీస్తోందని ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా నిలిచింది. దేశంలో నిరుద్యోగం, పరీక్షలు అస్తవ్యస్తం కావడం, యువతలో పెరుగుతున్న అసంతృప్తి తదితర అంశాలపై సెటైరికల్‌ స్పందిస్తూ వెలుగులోకి వచ్చిన ఈ సోషల్‌ మీడియా ట్రెండ్‌ యూత్‌ను ఆకర్షిస్తోంది. ‘మై భీ కాక్రోచ్’ అనే నినాదంతో మొదలైన ఈ ట్రెండ్ ప్రస్తుతం పొలిటికల్‌ సెటైర్‌గా మారింది. ప్రస్తుతం ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, రెడిట్‌ వంటి సోషల్‌ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో వేలాది పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పరీక్షల గందరగోళం, ప్రభుత్వ వ్యవస్థల పనితీరుపై మీమ్స్‌, సెటైర్లు, పోస్టులతో ఈ ఉద్యమం వేగంగా విస్తరిస్తోంది. ‘ఉద్యోగం లేదు.. భవిష్యత్తు క్లారిటీ లేదు.. కానీ మీమ్స్ మాత్రం ఉన్నాయి’ అంటూ యువత పోస్టులు పెడుతుండడం గమనార్హం.

Read Also : Panic Button | పబ్లిక్‌ వాహనాల్లో పానిక్‌ బటన్‌, ట్రాకింగ్‌ డివైజ్‌ తప్పనిసరి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

ట్రెండ్‌కు మూల కారణం ఇదే..

ఈ ట్రెండ్‌కు మూల కారణం ఇటీవలి న్యాయవ్యవస్థకు సంబంధించిన ఓ వ్యాఖ్య చుట్టూ జరిగిన వివాదమే. ఆ వ్యాఖ్య సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో కొందరు యువత దాన్ని సెటైరికల్‌ మారుస్తూ రాజకీయ ప్రచార అస్త్రంగా మలిచారు. అదే ప్రస్తుతం ‘కాక్రోచ్ జనతా పార్టీ’గా మారింది. ఈ నెల 15న ఓ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ఉపాధి లేని యువతను ఉద్దేశించి కాక్రోచెస్‌ (బొద్దింకలు)ల ఉన్నారంటూ వ్యాఖ్యానించారని ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తను ఆయన ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, దేశ యువతను కాకుండా నకిలీ డిగ్రీలతో న్యాయవృత్తిలోకి వచ్చేవారిని ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. అంతే కాకుండా యువతే వికసిత భారత్‌కు స్తంభాలుగా పేర్కొన్నారు.

Read Also : జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఎదురుదెబ్బ.. ఈడీ కేసులో పిటిషన్‌ వెనక్కి తీసుకున్న శ్రీలంకన్‌ బ్యూటీ..!

ఉద్యమాన్ని మొదలుపెట్టిన విద్యార్థి

ఈ ఆన్‌లైన్‌ ఉద్యమాన్ని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజీత్ దీప్కే ప్రారంభించాడు. ‘సెక్యులర్‌, సోషలిస్ట్‌, డెమోక్రటిక్‌, లేజీ’ అనే వినూత్న ట్యాగ్‌లైన్‌తో పార్టీని సోషల్ మీడియాలో పరిచయం చేశారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు, రోజంతా ఆన్‌లైన్‌లో గడిపేవారు, పరీక్షల ఒత్తిడితో విసిగిపోయిన విద్యార్థులు అందరూ ఈ పార్టీ సభ్యులేనంటూ సరదాగా ప్రచారం చేపట్టాడు. ఆరంభమైన రెండురోజుల్లోనే పార్టీకి ప్రత్యేక వెబ్‌సైట్‌, ప్రచార గీతం సైతం వెలుగులోకి వచ్చాయి. ఎక్స్‌లో దాదాపు 40 వేల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లు చేరారు. లక్ష మందికిపైగా యువత ఆన్‌లైన్‌లో సభ్యత్వం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఉద్యమం కేవలం సరదా పోస్టుల వరకే ఆగిపోలేదు. నీట్‌ పేపర్ లీక్‌, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు వంటి అంశాలపై కూడా స్పందించడం ప్రారంభించింది. సీబీఎస్ఈ రీచెకింగ్ ఫీజులు తగ్గించాలని, పోటీ పరీక్షల్లో పారదర్శకత ఉండాలని డిమాండ్లు చేస్తోంది. విద్యార్థుల ఆందోళనలను వ్యంగ్యరూపంలో చెప్పినా, అందులో అసలు సమస్యలే దాగి ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Read Also : అనుకున్న సమయానికి నైరుతి ఆగమనం.. 25 నుంచి 27 మధ్య కేరళను తాకే ఛాన్స్‌..!

రాజకీయ వర్గాల్లోనూ చర్చ

ఈ ఆన్‌లైన్ ఉద్యమానికి కొందరు రాజకీయ నాయకులు కూడా మద్దతుగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కొందరు ప్రముఖులు సోషల్ మీడియాలో ఈ పార్టీ పోస్టులను షేర్ చేయడంతో విషయం మరింత వైరల్ అయింది. దీంతో ఇది సాధారణ మీమ్ పేజ్ కాదని, యువత అసంతృప్తికి ప్రతిబింబంగా మారుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాల కొరత, పరీక్షల వాయిదాలు, పేపర్ లీకులు, పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి వంటి అంశాలతో ఇప్పటికే యువతలో అసహనం పెరుగుతోంది. ఆ భావోద్వేగానికే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఒక సెటైరికల్ వేదికగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. నవ్వుల్లోనే నిరాశను, మీమ్స్‌లోనే బాధను వ్యక్తం చేస్తున్న కొత్త తరహా డిజిటల్ నిరసనగా దీన్ని చాలామంది చూస్తున్నారు.

Read Also : వైరస్‌లను అడ్డుకునే జిగురు తరహా ప్రోటీన్లు.. సీసీఎంబీ కీలక అధ్యయనం..

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »