అక్టోబర్ 30లోపు కొత్త పార్టీని ప్రకటిస్తానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు తనతో టచ్‌లో ఉన్నారని, త్వరలోనే తన పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పారు. అయితే పార్టీ ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదని, అందువల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా పార్టీ పెట్టబోతున్నట్లు ఇప్పటికే విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఎప్పుడు ఏర్పాటు కానుంది? పార్టీ నిర్మాణం ఎలా ఉండబోతోంది? అనే అంశాలపై ఆయన మాట్లాడారు.
అక్టోబర్ 30లోపు పార్టీని నెలకొల్పాలన్నది తన సంకల్పమని విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ ఆవిర్భావంతో పాటు పార్టీ జెండా, పార్టీకి సంబంధించిన సింబల్, విధివిధానాలను ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ ఆవిర్భావం తర్వాత రాజ్యాంగం ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని ఎలా నడపాలి అనే అంశాలకు సంబంధించి నిబంధనలను రూపొందిస్తామన్నారు.
ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పార్టీని నడపాలన్నది తన అభిమతమని, ఆశయమని విజయసాయిరెడ్డి తెలిపారు.
తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోనని, పార్టీలో 45 నుంచి 50 శాతం వరకు యువతకు ప్రాధాన్యత ఇస్తానని గతంలోనే ప్రకటించిన విషయాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఇంకా ఆవిర్భావం చెందలేదని, పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. అందువల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉండదన్నారు.
పార్టీ ఆవిర్భావం తర్వాత అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా పొలిట్‌బ్యూరోను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీలో పొలిట్‌బ్యూరో అత్యున్నత నిర్ణయాత్మక బాడీగా ఉంటుందని, దాని నిర్ణయమే తుది నిర్ణయం అవుతుందని చెప్పారు.
పార్టీ పేరును ఇప్పటికే ఖరారు చేశామని, దానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు.
ఇతర పార్టీల నుంచి కీలక నేతలు కొత్త పార్టీలో చేరే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. అయితే పార్టీ ఆవిర్భావానికి ముందే వారి వివరాలను బయటపెట్టడం సరైన పద్ధతి కాదన్నారు.
గతంలో కొన్ని నిర్ణయాలను ముందుగానే ప్రకటించిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో తనకు అనుభవం ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. అందువల్ల పార్టీలో ఎవరు చేరుతారనే విషయాన్ని పార్టీ ఆవిర్భావం తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.


