ఖ‌మేనీ కుటుంబం మొత్తం చ‌నిపోయిందా.. ఇరానియన్ల సంబురాలు ఓ రేంజ్‌లో… వీడియోలు వైర‌ల్‌

ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei మరణంతో దేశవ్యాప్తంగా 40 రోజుల సంతాప దినాలు ప్రకటించగా, కొన్ని ప్రాంతాల్లో సంబరాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Khameneis family
PC:livemint.com

ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ క‌న్నుమూసారు. ఖమేనీ మరణం ప్రాంతీయ రాజకీయాలపై, భద్రతా పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై పలు దేశాల నేతలు స్పందిస్తున్న నేపథ్యంలో, పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత, సుప్రీం లీడర్ అలీ ఖ‌మేనీ Ali Khamenei మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా ధృవీకరించింది. కొన్ని గంటల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించింది. ఖమేనీ మరణంతో దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు ప్రభుత్వ సంతాప దినాలు ప్రకటించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదనంగా ఏడు రోజుల పాటు జాతీయ సెలవులను కూడా ప్రకటించింది.

Also Read: బ్రేకింగ్: దుబాయ్ బుర్జ్ అల్ అరబ్ హోటల్‌పై ఇరాన్ డ్రోన్ దాడి, మంటలు ఎగిసిపడుతున్న వీడియోలు వైరల్!

శోకసంద్రంలో ఇరాన్.. టీవీల్లో నల్ల బ్యానర్లు

ఖమేనీ మరణవార్త వెలువడిన వెంటనే ఇరాన్ అధికారిక వార్తా ఛానెల్ IRINN శోకసూచక కార్యక్రమాలతో ప్రసారాలను కొనసాగిస్తోంది. టీవీ స్క్రీన్ పైభాగంలో నలుపు రంగు బ్యానర్లు ప్రదర్శిస్తూ, ఖమేనీ చిత్రపటాల నేపథ్యంగా ఖురాన్ పారాయణం వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా మసీదులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో ఆయన చిత్రాలను ఏర్పాటు చేసి నివాళులు అర్పిస్తున్నారు. 1989లో రుహోల్లా ఖొమేనీ మరణం అనంతరం సుప్రీం లీడర్ బాధ్యతలు స్వీకరించిన ఖమేనీ, దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఇరాన్ రాజకీయ, మత వ్యవస్థలను తన ప్రభావంతో నడిపించారు. ఆయన మరణంతో ఇరాన్ రాజకీయాల్లో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది.

ఖమేనీ మరణాన్ని ధృవీకరిస్తూ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక కఠిన ప్రకటన విడుదల చేసింది. ఈ దారుణానికి అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని పేర్కొంది. ఖమేనీ మృతిని “వీరమరణం”గా అభివర్ణిస్తూ, “ఈ ఆత్మబలిదానం వ్యర్థం కాదు. అణచివేతదారులపై పోరాటానికి ఇది నాంది” అని హెచ్చరించింది. ఇటీవల నెలకొన్న యుద్ధ వాతావరణంలో ఇరాన్ ఇప్పటికే తన సైనిక దళాలను అప్రమత్తం చేసింది. పశ్చిమ దేశాల హస్తం ఈ ఘటన వెనుక ఉందన్న ఆరోపణలతో రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు సమాచారం.

యూఎస్, ఇజ్రాయెల్ దళాలు ఖమేనీ నివాసంపై దాదాపు 30 క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్ప‌ష్టం చేసింది. ఖమేనితోపాటు ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనమరాలు మృతిచెందినట్లు ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ ప్రభుత్వ రంగ సంస్థ కాన్, ప్రముఖ ఛానెల్ 12 వెల్లడించిన వివరాల ప్రకారం.. టెహ్రాన్ లోని ఖమేనీ నివాసంపై జరిగిన భారీ బాంబు దాడిలో ఖమేనీ మరణించారు. దాడి జరిగిన కొన్ని గంటల తరువాత నివాస శిథిలాల నుంచి ఆయన మృతదేహాన్ని వెలికితీసినట్లు సమాచారం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్లు ఇరాన్ అధికారికంగా పేర్కొన‌గా, 40 రోజులు సంతాప దినాలను ప్రకటించింది.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి వార్త వెలువడిన తర్వాత దేశంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నట్టు అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఒకవైపు అధికారికంగా సంతాప దినాలు ప్రకటించగా, మరోవైపు కొన్నిచోట్ల ఆందోళనకారులు సంబరాలు చేసుకున్న దృశ్యాలు బయటకు వస్తున్నాయి. పలు నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నినాదాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. “ఇస్లామిక్ రిపబ్లిక్‌కు ముగింపు కావాలి” అంటూ నినాదాలు వినిపించాయని అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఇరాన్ శివారు ప్రాంతమైన బైసత్ టౌన్‌లో కొందరు ప్రజలు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ సంబరాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ దృశ్యాలను ఫాక్స్ న్యూస్ ప్రసారం చేసినట్లు సమాచారం. అలాగే ఇజ్రాయెల్ మాజీ అధికార ప్రతినిధి ఎలాన్ లేవీ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఖమేనీ మరణ వార్త తెలిసిన తర్వాత కొంతమంది ఇరాన్ మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లోకి వచ్చి నృత్యాలు చేసినట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నట్టు సమాచారం. ఖమేనీ మృతి అనంతరం ఇరాన్ రాజకీయ, సామాజిక వాతావరణంలో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశమున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »