ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్‌కు చెందిన పలు మీడియా సంస్థలు కూడా ధృవీకరించాయి. శనివారం టెహ్రీన్ నగరంలోని 30 ప్రాంతాలపై భారీ స్థాయిలో బాంబుల వర్షం కురిసినట్లు సమాచారం.
ఇరాన్ ఉన్నతాధికారులనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మృతి చెందినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది. అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
Also Read: బ్రేకింగ్: దుబాయ్ బుర్జ్ అల్ అరబ్ హోటల్‌పై ఇరాన్ డ్రోన్ దాడి, మంటలు ఎగిసిపడుతున్న వీడియోలు వైరల్!
ఇరాన్‌లో మారణహోమం
ఈ దాడులతో ఇరాన్‌లో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటి వరకు 201 మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 160 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. పౌర ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇరాన్ రక్షణమంత్రి అమీర్, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్‌లు కూడా ఈ దాడుల్లో మృతి చెందినట్లు సమాచారం.ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
అంతర్జాతీయ ఉద్రిక్తతలు
ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇజ్రాయెల్, అమెరికా పై ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. ప్రపంచ దేశాలు పరిస్థితిని ఆందోళనగా గమనిస్తున్నాయి.
పరిస్థితుల దృష్ట్యా భారత్ కూడా అప్రమత్తమైంది. ఎయిర్ ఇండియా మొత్తం 44 విమాన సర్వీసులను రద్దు చేసింది. యూరప్, అమెరికా, కెనడా నగరాలకు వెళ్లే సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే ఇండిగో కూడా పలు విమానాలను రద్దు చేసింది. ఇరాన్ సహా 11 దేశాల గగనతలాలపై ప్రయాణించవద్దని Directorate General of Civil Aviation (డీజీసీఏ) ఎయిర్‌లైన్స్‌కు సూచనలు జారీ చేసింది. మొత్తం మీద ఖమేనీ మృతి పశ్చిమాసియాలో రాజకీయ, భద్రతా సమీకరణాలను పూర్తిగా మార్చే పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత విషమించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.