టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా–పాకిస్థాన్ మహా సమరం ఖాయం… యూ-టర్న్ తీసుకున్న‌ పాక్ ప్రభుత్వం

ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. పాకిస్థాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటనతో మ్యాచ్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లు ఉత్కంఠ‌తో ఎదురు చూసిన భార‌త్ పాక్ అభిమానులు మంచి హైఓల్టేజ్ మ్యాచ్ చూసే అవ‌కాశం ద‌క్కింది.

India vs Pakistan T20 World Cup match confirmed after Pakistan government U-turn
India vs Pakistan T20 World Cup match confirmed after Pakistan government U-turn

India vs Pakistan T20 World Cup Match

  • టీ20 వరల్డ్ కప్‌లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ జరగడం ఖాయమైంది.

  • భద్రతా, రాజకీయ కారణాలతో మొదట వెనక్కి తగ్గిన పాక్ ప్రభుత్వం ఇప్పుడు యూ-టర్న్ తీసుకుంది.

  • క్రికెట్ అభిమానుల్లో ఈ నిర్ణయంతో భారీ ఉత్సాహం నెలకొంది.

టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా–పాకిస్థాన్ మధ్య జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్‌పై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ముగింపు లభించింది. భారత్‌తో ఆడబోమంటూ ఇంతకాలం మొండి వైఖరి ప్రదర్శించిన పాకిస్థాన్ చివరకు యూ-టర్న్ తీసుకుంది. ఫలితంగా ఈ ఆదివారం, ఫిబ్రవరి 15న జరగనున్న ఈ క్రికెట్ మహా సమరం యథాతథంగా కొనసాగనుంది. సుమారు రూ.4,000 కోట్ల విలువైన ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం అర్థరాత్రి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం.

ఊహాగానాలకి చెక్..

పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో “బహుపాక్షిక చర్చల్లో సాధించిన ఫలితాలు, మిత్రదేశాల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఫిబ్రవరి 15, 2026న జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌తో తలపడాలని పాకిస్థాన్ క్రికెట్ జట్టును ఆదేశిస్తున్నాం. క్రికెట్ స్ఫూర్తిని కాపాడటం, ప్రపంచ క్రికెట్ వ్యవస్థకు భంగం కలగకుండా చూడటం మా బాధ్యత” అని పేర్కొంది. ఈ ప్రకటనతో అనేక ఊహాగానాలకు చెక్ పడింది.

పాక్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి పలు కారణాలు పనిచేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం రాసిన లేఖ కీలకంగా మారింది. పాకిస్థాన్ తమకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా భారత్‌తో మ్యాచ్ ఆడాలని కోరడం పాక్‌కు ఒక గౌరవప్రదమైన మార్గం కల్పించినట్టైంది. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయక కూడా వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పాక్ ప్రధానికి సూచించినట్టు సమాచారం. ఇదే సమయంలో ఐసీసీ కూడా గట్టి వైఖరి అవలంబించింది. ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే ఆర్థిక నష్టాలతో పాటు సభ్యత్వంపై ప్రభావం పడే అవకాశముందని స్పష్టం చేస్తూ ‘ఫోర్స్ మేజ్యూర్’ క్లాజును అంగీకరించబోమని తేల్చి చెప్పింది.

ఐసీసీ హామీలు..

ఇక ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ కొన్ని హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. భారత్‌లో ఆడటానికి నిరాకరించినందుకు బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి తప్పించినప్పటికీ, వారిపై ఎటువంటి ఆర్థిక లేదా క్రీడాపరమైన శిక్షలు ఉండవని తెలిపింది. అలాగే 2028 నుంచి 2031 మధ్యకాలంలో ఒక ఐసీసీ గ్లోబల్ ఈవెంట్ హోస్టింగ్ హక్కులు కల్పించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది. డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీని ఆశ్రయించే హక్కు కూడా బీసీబీకి ఉంటుందని స్పష్టం చేసింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఐసీసీ ముందు ఉంచిన కొన్ని డిమాండ్లను కూడా ఐసీసీ తిరస్కరించింది. భారత్–పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లను పునఃప్రారంభించాలని, భారత్–పాక్–బంగ్లాదేశ్‌లతో త్రైపాక్షిక సిరీస్ నిర్వహించాలని చేసిన ప్రతిపాదనలను ఐసీసీ స్పష్టంగా కొట్టిపారేసింది. ద్వైపాక్షిక సిరీస్‌లు సంబంధిత బోర్డుల పరిధిలోనే ఉంటాయని, అందులో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.

ప్రస్తుతం కొలంబోలో ఉన్న పాకిస్థాన్ జట్టు ఫిబ్రవరి 10న అమెరికాతో జరగనున్న తమ తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారించింది. “ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము సిద్ధంగా ఉంటాం” అని పాక్ ఆటగాడు సల్మాన్ మీర్జా వ్యాఖ్యానించడం గమనార్హం. ఏదేమైనా ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందని అధికారిక ప్రకటన రావడంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈ హై వోల్టేజ్ పోరుకు కౌంట్‌డౌన్ మొదలైనట్టే.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »