ఐపీఎల్‌ 2026 ప్లే ఆఫ్స్‌కు రంగం సిద్ధం.. ఎస్‌ఆర్‌హెచ్‌తో రాజస్థాన్‌ ఢీ..!

ఐపీఎల్‌ 2026 ప్లే ఆఫ్స్‌ (IPL 2026 Playoffs) కు ఆర్‌సీబీ (Royal Challengers Bengaluru), గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad), రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) అర్హత సాధించాయి. రేపటి నుంచి ప్లే ఆఫ్‌ పోరు మొదలుకానుంది. ఈ సారి ఎలాగైన టైటిల్‌ను నిలబెట్టుకోవాలని డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆర్‌సీబీ భావిస్తోంది. మరో వైపు 2016 నాటి సీన్‌ రిపీట్‌ చేయాలని సన్‌రైజర్స్‌ కృతనిశ్చయంతో ఉన్నది.

IPL 2026 Playoffs
IPL 2026 Playoffs

IPL 2026 | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) 2026 సీజన్‌ తుది దశకు చేరుకుంది. టోర్నీ లీగ్‌ దశ ముగిసింది. అన్ని జట్లు 14 మ్యాచులు ఆడాయి. రేపటి నుంచి ప్లే ఆఫ్‌ పోరు మొదలుకానుంది. ప్లే ఆఫ్స్‌కు నాలుగు జట్లు అర్హత సాధించాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ సారి కూడా ప్లే ఆఫ్స్‌ రేసు లీగ్‌ దశ చివరి రోజు వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి రాజస్థాన్‌ రాయల్స్‌ నాలుగో జట్టుగా టాప్‌-4లో చోటు సంపాదించింది. సీజన్‌ ఆరంభంలో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా దూసుకెళ్లిన పంజాబ్‌ కింగ్స్‌ చివరలో వరుస పరాజయాలతో ఒక్క పాయింట్‌ తేడాతో ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చివరి వరకు పోరాడినా చివరి మ్యాచ్‌లో విజయం సాధించలేక నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Read Also : ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ రికార్డు.. అత్యధికసార్లు 200 ప్లస్‌ రన్స్‌ చేసిన జట్టుగా ఘనత..!

ప్లే ఆఫ్‌కు అర్హత సాధించిన జట్లు

ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ ముందే ప్లే ఆఫ్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. ఆ తర్వాత గుజరాత్‌ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌ మూడో స్థానంలో, రాజస్థాన్‌ రాయల్స్‌ నాలుగో స్థానంలో ఉంది. అయితే, బెంగళూరు, గుజరాత్‌, హైదరాబాద్‌ జట్ల పాయింట్లు సమానంగా 18 ఉన్నా.. మెరుగైన రన్‌రేట్‌ పరంగా బెంగళూరు, గుజరాత్‌ జట్లు హైదరాబాద్‌ కంటే ముందున్నాయి. చివరి మ్యాచ్‌లో విజయంతో ప్లే ఆఫ్‌ బెర్తు ఖరారు చేసుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి.

ప్లే ఆఫ్స్‌ ఫార్మాట్‌ ఎలా ఉంటుంది?

అంతర్జాతీయ టోర్నీల్లో ఉండే సాధారణ సెమీఫైనల్‌ విధానానికి భిన్నంగా ఐపీఎల్‌లో స్పెషల్‌గా ప్లే ఆఫ్స్‌ సిస్టమ్‌ను బీసీసీఐ అమలు చేస్తోంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫయర్‌-1లో తలపడతాయి. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్‌ విజేతతో క్వాలిఫయర్‌-2 ఆడుతుంది. క్వాలిఫయర్‌-2లో గెలిచిన జట్టు ఫైనల్లో క్వాలిఫయర్‌-1 విజేతతో తలపడుతుంది. లీగ్‌ దశలో నిలకడగా రాణించిన జట్లకు అదనంగా అవకాశం కల్పించేందుకు ఈ సిస్టమ్‌ను బీసీసీఐ రూపొందించింది.

Read Also : తెలంగాణలో భానుడి భగభగలు.. రెండురోజుల్లో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. ఐఎండీ రెడ్‌ అలర్ట్‌..!

ఐపీఎల్‌ ఫ్లే ఆఫ్‌ షెడ్యూల్‌ ఇదే

క్వాలిఫయర్‌-1: ఆర్‌సీబీ vs గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌ మే 26న ధర్మశాలలో జరుగుతుంది.
ఎలిమినేటర్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మే 27, న్యూ చండీగడ్‌లో ఉంటుంది.
క్వాలిఫయర్‌-2: క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టు vs ఎలిమినేటర్‌ విజేత మే 29, న్యూ చండీగఢ్‌లో తలపడుతాయి.
ఫైనల్‌: క్వాలిఫయర్‌-1 విజేత vs క్వాలిఫయర్‌-2 విజేతలు మే 31, అహ్మదాబాద్‌ వేదికగా ఆడుతాయి.

ఏ జట్టు గెలిచినా రెండోసారి..

ఈసారి ప్లే ఆఫ్స్‌లోకి వచ్చిన నాలుగు జట్లకు ఒక్కో ఐపీఎల్‌ టైటిల్‌ను సాధించాయి. దీంతో రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకునేందుకు అన్ని జట్లు ఉత్సాహంతో బరిలోకి దిగబోతున్నాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.. గుజరాత్‌ టైటాన్స్‌ 2022లో తమ తొలి సీజన్‌లోనే టైటిల్‌ గెలిచింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 2016లో విజేతగా నిలిచింది. రాజస్థాన్‌ రాయల్స్‌ 2008లో జరిగిన తొలి ఐపీఎల్‌ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఎలిమినేటర్‌ నుంచి ఫైనల్‌ చేరి టైటిల్‌ గెలిచిన జట్టుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. 2016 విజయాన్ని మరోసారి పునరావృతం చేయాలని ఆ జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ముంబయి ఇండియన్స్‌ తర్వాత వరుసగా రెండు సీజన్లలో టైటిల్‌ సాధించిన జట్టుగా నిలవాలని ఆర్‌సీబీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్లేఆఫ్స్‌ మరింత రసవత్తరంగా మారనున్నాయి. మ్యాచులన్నీ రాత్రి 7.30 గంటలకు జరుగనున్నాయి.

Read Also : సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కాక్రోచ్‌ జనతా పార్టీ..! పెద్ద ఎత్తున సభ్యులుగా చేరుతున్న యువత..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »