ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించిన బంగ్లాదేశ్ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ జట్టును ఐసీసీ అధికారికంగా తప్పించింది. భారత్‌కు రావడానికి నిరాకరించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వైఖరి కారణంగా, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ప్రపంచ స్థాయి క్రికెట్ టోర్నీ నుంచి ఓ పూర్తి సభ్య దేశాన్ని ఇలా తొలగించడం ఐసీసీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు వెళ్లేది లేదని బంగ్లాదేశ్ బోర్డు మొదటి నుంచే స్పష్టంగా చెబుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో పరిస్థితి చేజారకుండా ఉండేందుకు ఐసీసీ బీసీబీకి 24 గంటల గడువు ఇచ్చింది. అయినప్పటికీ బంగ్లాదేశ్ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం, క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తేల్చిచెప్పారు. చివరి ప్రయత్నంగా ఐసీసీ ప్రతినిధులు శుక్రవారం మరోసారి చర్చలు జరిపినా అవి ఫలించలేదు.
స్కాట్లాండ్‌కి ఛాన్స్..
ఈ పరిస్థితుల్లో బీసీబీకి పంపిన అధికారిక లేఖలో, భారత్‌లో ఆడేందుకు నిరాకరించినందున టీ20 వరల్డ్‌కప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను తప్పిస్తున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. అదే సమయంలో స్కాట్లాండ్‌కు గ్రూప్ సీలో చోటు కల్పించినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టోర్నీలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ పోటీ పడనుంది.
ఈ వివాదం ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించిన ఘటన తర్వాత మరింత ముదిరింది. ఆ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో ఆడే మ్యాచ్‌లపై భద్రతా అనుమానాలు ఉన్నాయని బీసీబీ ఐసీసీకి వరుసగా ఈమెయిల్స్ పంపింది. బంగ్లాదేశ్ అభ్యర్థనను పరిశీలించిన ఐసీసీ, స్వతంత్ర భద్రతా అంచనాలు కూడా నిర్వహించింది. అయితే భారత్‌లో బంగ్లా జట్టుకు ఎలాంటి ముప్పు లేదని నివేదిక రావడంతో, షెడ్యూల్ మార్చే అవకాశం లేదని ఐసీసీ స్పష్టంగా తెలిపింది.
Also Read: స్మృతి మంధాన–పలాష్ ముచ్చల్ పెళ్లి వివాదంలో ట్విస్ట్.. వివాహం రోజు వేరే అమ్మాయితో దొరికాడా?
టోర్నీ షెడ్యూల్‌లో మార్పులు
- బంగ్లాదేశ్ గ్రూప్ సీలో ఉండాల్సిన జట్లు
- ఈ జట్టుతో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్ ఉన్నాయి.
- ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ ఆడాల్సి ఉంది
- కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో మూడు మ్యాచ్‌లు
- ముంబై వాంఖడేలో ఒక మ్యాచ్
- ఈ అన్ని మ్యాచ్‌లను ఇప్పుడు స్కాట్లాండ్ జట్టు ఆడనుంది.
ఐసీసీ నిర్ణయంపై కీలక అంశాలు:
- టోర్నీ సమగ్రత దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసిన ఐసీసీ
- గడువు ఇచ్చినా బీసీబీ వైఖరిలో మార్పు లేకపోవడం
- భద్రతాపరమైన నివేదికలు భారత్‌కు అనుకూలంగా రావడం
- షెడ్యూల్‌లో గందరగోళం తలెత్తకుండా ముందస్తు చర్య
ఈ నిర్ణయంతో టీ20 వరల్డ్‌కప్ 2026 షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు, స్కాట్లాండ్‌కు ఇది అరుదైన అవకాశం కావడంతో ఆ జట్టు శిబిరంలో ఉత్సాహం నెలకొంది. ఈ పరిణామాలు ప్రపంచ క్రికెట్‌లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.