108 Ambulance Services | ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచే 108 అంబులెన్స్ సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతతో మరింత బలోపేతం చేసింది. ప్రమాదం జరిగిన క్షణం నుంచి బాధితుడికి చికిత్స అందే ప్రతి నిమిషం కీలకమనే భావనతో అత్యవసర వైద్య సేవలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దినట్లు ప్రభుత్వం వెల్లడించింది. భవ్య హెల్త్‌కేర్ సహకారంతో 108 వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్, రియల్ టైమ్ ట్రాఫిక్ నావిగేషన్, డిజిటల్ పేషెంట్ రికార్డులు వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రమాదాలు, అత్యవసర ఆరోగ్య సమస్యల సమయంలో బాధితులను ‘గోల్డెన్ అవర్’లోనే చేరుకుని ప్రాథమిక చికిత్స అందించే సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. జూన్ 2025 నుంచి మే 2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా 108 అంబులెన్స్ సేవలకు మొత్తం 7,78,799 అత్యవసర కాల్స్ వచ్చినట్లు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడా లేకుండా లక్షలాది కుటుంబాలకు ఈ సేవలు భరోసాగా నిలిచాయని పేర్కొన్నారు.
Read Also : ఏపీకి మరో భారీ రైల్వే ప్రాజెక్టు.. విశాఖ-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు ప్రతిపాదన
బిగ్‌బాస్ వచ్చేస్తున్నాడు.. నాగ్ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో అనౌన్స్‌మెంట్‌ని వదిలిన మేకర్స్..!
వీరప్పన్ ఇంటర్వ్యూ కేసులో నటి సుకన్యకు ఊరట.. పరిహారం చెల్లించాలని సన్ టీవీకి మద్రాస్ హైకోర్టు ఆదేశం..!
అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఉంటే పీఎం కిసాన్ పథకం వర్తించదా? రైతులు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..!
ఈ కాలంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన 1,13,764 మందికి ఘటన స్థలంలోనే అత్యవసర వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. అలాగే 1,05,786 మంది గర్భిణులను సురక్షితంగా వైద్య కేంద్రాలకు తరలించారు. మాతా, శిశు మరణాల తగ్గుదలలో ఈ సేవలు కీలక పాత్ర పోషించాయని అధికారులు వెల్లడించారు. 108 సేవల నిర్వహణలో రెండు ప్రధాన విభాగాలు కీలకంగా పనిచేస్తున్నాయి. ఒకటి ఇంటర్ ఫెసిలిటీ ట్రాన్స్‌ఫర్ (ఐఎఫ్‌టీ), మరొకటి సాధారణ అత్యవసర సేవలు. ఐఎఫ్‌టీ కింద 2,53,022 కేసులను నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందుతున్న తీవ్ర అనారోగ్య బాధితులను మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు సురక్షితంగా తరలించారు. ఇక నాన్-ఐఎఫ్‌టీ విభాగంలో 5,25,777 కేసులకు స్పందించారు. ప్రమాద స్థలాలు, ఇళ్లు, పొలాలు వంటి ప్రాంతాలకు వేగంగా చేరుకుని బాధితులకు అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించి సమీప ఆస్పత్రులకు తరలించారు. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన 1,13,764 కేసులకు స్పందించగా, గర్భధారణ, ప్రసూతి సంబంధిత 1,05,786 అత్యవసర పరిస్థితులను నిర్వహించారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 97,118 మందికి ఆక్సిజన్ అందిస్తూ అత్యవసర చికిత్స చేశారు.
Read Also : త్వరలో అందుబాటులోకి భోగాపురం ఎయిర్‌పోర్ట్.. ఎలక్ట్రిక్ బసులు నడిపేందుకు ఆర్టీసీ ప్లాన్..!
వాహన ప్రమాదాలకు సంబంధం లేని గాయాల కేసులు 49,342 రికార్డయ్యాయి. అలాగే 45,951 గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు, 40,553 అపస్మారక స్థితి కేసులను సమర్థంగా నిర్వహించారు. అధునాతన వైద్య పరికరాలు, ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది సహకారంతో బాధితులను స్థిరీకరించి ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇవే కాకుండా 34,532 కడుపు నొప్పి కేసులు, 32,858 విషప్రయోగ ఘటనలు, 29,485 మూర్ఛ కేసులు, 20,278 స్ట్రోక్ బాధితులు, 14,007 నవజాత శిశువుల అత్యవసర పరిస్థితులకు కూడా 108 అంబులెన్స్ సర్వీసెస్ స్పందించాయి. ముఖ్యంగా గుండెపోటు వంటి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కొన్ని నిమిషాల ఆలస్యం కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండె సంబంధిత కేసుల కోసం ప్రత్యేక స్పందన విధానాలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 108 అంబులెన్సుల్లో అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ (ALS), ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలేటర్లు (AED), ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సిబ్బంది (EMTs) రోగి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రయాణంలోనే ఆస్పత్రులకు చేరవేస్తున్నారు. దీంతో బాధితుడు ఆస్పత్రికి చేరుకునేలోపే వైద్య బృందాలు చికిత్సకు సిద్ధమయ్యే అవకాశం కలుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ పొందిన సిబ్బంది, వేగవంతమైన స్పందన కలయికతో 108 సేవలు రాష్ట్ర ప్రజలకు మరింత విశ్వసనీయ అత్యవసర వైద్య వ్యవస్థగా మారుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
Read Also : శ్రీశైలం ఘాట్‌లో ఎలివేటెడ్ కారిడార్.. వన్యప్రాణులపై వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌తో అధ్యయనం..