Weather Report | తెలంగాణకు వాతావరణ శాఖ తీపి కబురు.. రెండురోజులు భారీ వ‌ర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ

నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) విస్త‌ర‌ణ‌కు ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నాయ‌ని, గురువారం కేర‌ళ‌ను తాకే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ (IMD) అంచ‌నా వేసింది. తెలంగాణ (Telangana)లో ద్రోణి (Trough) ప్రభావంతో రెండురోజులు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

IMD Issues Heavy Rain Alert for Telangana
IMD Issues Heavy Rain Alert for Telangana

Weather Report | తెలంగాణ ప్ర‌జ‌ల‌కు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం శుభ‌వార్త చెప్పింది. ఇటీవ‌ల గ‌త‌కొంత‌కాలంగా ఎండ‌ల‌తో తీవ్ర ఇబ్బందులుప‌డుతున్నారు. బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు భానుడు ప్ర‌తాపం చూపుతుండ‌డంతో రాత్రిళ్లు సైతం వేడి త‌గ్గ‌డం లేదు. ఫ‌లితంగా జ‌నాలు తీవ్ర ఉక్క‌పోత‌తో ఇబ్బందులుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు ఈ సమయంలో గంటకు 50–60 కిలోమీట‌ర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read Also : ఎన్నికుట్ర‌లు చేసినా స్థానిక సంస్థ‌ల్లో వైసీపీ జెండా ఎగ‌రాలి.. నేత‌ల‌కు జ‌గ‌న్ పిలుపు..!

ఈ జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..

ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మేడ్చల్–మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఆయా జిల్లాల‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట సహా మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. అలాగే, ఆ త‌ర్వాతి మూడురోజులు సైతం వర్షాల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. వ‌ర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలే ప్రమాదం, విద్యుత్ అంతరాయాలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని సూచించారు. ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్ష సూచనతో కొంత ఉపశమనం ల‌భించ‌నుంది.

Read Also : త్వ‌ర‌లో కూత‌పెట్ట‌నున్న హైడ్రోజ‌న్ రైలు.. ఆమోదం తెలిపిన బోర్డు..!

రేపు కేర‌ళ‌కు నైరుతి..

నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు ప్రాంతాల్లో మరింత ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతాలు, కేరళ, తమిళనాడు తీరంలోని కొన్ని భాగాలు, అలాగే నైరుతి, పశ్చిమ, మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో రుతుపవనాల విస్తరణకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. గురువారం నాటికి రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను తాకే అవ‌కాశం ఉంద‌ని, అలాగే, బంగాళాఖాతం ప్రాంతంలోని మరిన్ని భాగాల్లోకి విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ పశ్చిమ భాగం నుంచి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి వ్యవస్థ ప్రభావం కొనసాగుతోందని వెల్లడించింది. ఈ ద్రోణి మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఏర్పడిన ద్రోణి ప్రభావం తగ్గినప్పటికీ, అదే ప్రాంతం నుంచి తమిళనాడు ఉత్తర తీరాల వరకు ఉన్న మరో ద్రోణి స‌ముద్ర‌మ‌ట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వివ‌రించింది.

Read Also : అది న‌టుల‌కు మాత్ర‌మే ద‌క్కిన అరుదైన అవ‌కాశం.. సోనాక్షి సిన్హా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »