Hydrogen Train | భారతీయ రైల్వే పర్యావరహిత రవాణా దిశగా మరో చారిత్రక ముందడుగు వేసింది. డీజిల్‌పై ఆధారపడే సంప్రదాయ రైళ్లకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కీలక ప్రాజెక్టు ఉత్తర రైల్వే పరిధిలోని జింద్–సోనిపట్ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానుంది. రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ రైలు త్వరలో సేవల్లోకి రానుంది. గంటకు గరిష్ఠంగా 75 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ 10 బోగీల రైలు, 1,200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో పనిచేయనుంది. ఈ ప్రాజెక్టుతో భారత్ కూడా జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన చేరింది.
Read Also : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి నుంచి కొత్తగా వీక్లీ ట్రైన్స్..!
హైడ్రోజన్ ఆధారిత రైలు సాంకేతికతను పరీక్షిస్తున్న కొద్ది దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే.. హైడ్రోజన్ రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని నుంచి వెలువడేది కేవలం నీటి ఆవిరి మాత్రమే. దాంతో కార్బన్ ఉద్గారాలు పూర్తిగా తగ్గనున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం హర్యానాలోని జింద్‌లో ప్రత్యేక హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి అవసరమైన అనుమతులను పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోసివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO) ఇప్పటికే మంజూరు చేసింది. ఇంధనం నింపే ప్రక్రియ కోసం హైడ్రోజన్ కంప్రెషన్ వ్యవస్థతో పాటు స్టాండ్‌బై కంప్రెసర్ యూనిట్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ లీకేజ్ డిటెక్టర్లు, ఫ్లేమ్ సెన్సర్లు వంటి ఆధునిక పరికరాలను కేంద్రంలో అమర్చారు.
Read Also : ఎంజేపీ గురుకులాలకు ‘బ్రాండ్ ఇమేజ్’ తప్పనిసరి : మంత్రి పొన్నం ప్రభాకర్
ఆపరేషన్, నిర్వహణకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను ఆర్‌డీఎస్‌వో ఆమోదించిన మాన్యువల్స్ ఆధారంగా అమలు చేయనున్నారు. ఢిల్లీలోని శకూర్‌బస్తీ కేంద్రంలో నిర్వహణ కోసం పకడ్బందీగా భద్రతా ఆడిట్లు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు అమలు చేయనున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభ దశలో రైలుతో పాటు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సాంకేతిక బృందం కూడా ప్రయాణించనుంది. హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ వ్యవస్థపై 24 గంటల పర్యవేక్షణతో పాటు నిరంతర తనిఖీలు నిర్వహించనున్నారు. సుస్థిర ఇంధనం, సాంకేతిక ఆవిష్కరణల వైపు భారత రైల్వే వేస్తున్న ఈ అడుగు, దేశ నెట్ జీరో కార్బన్ లక్ష్యాలకు గణనీయంగా తోడ్పడనుందని రైల్వే మంత్రిత్వశాఖ పేర్కొంది.


