Sonakshi Sinha | బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటించిన తాజా ఓటీటీ చిత్రం ‘సిస్టమ్’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికపై ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా సహనటి జ్యోతికతో కలిసి మీడియాతో మాట్లాడిన సోనాక్షి.. నటన వృత్తిలో ఉన్న ప్రత్యేకత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి కొత్త పాత్ర నటుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, అదే యాక్టింగ్‌లో ఉన్న అసలైన మజా అని సోనాక్షి తెలిపింది. ఇతరుల జీవితాలను పాత్రల రూపంలో అనుభవించే అరుదైన అవకాశం నటులకు మాత్రమే దక్కుతుందని బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పేర్కొన్నారు. ప్రతి పాత్ర ద్వారా కొత్త వ్యక్తి జీవితాన్ని, కొత్త ప్రపంచాన్ని పరోక్షంగా జీవించే అవకాశం లభిస్తుందని, అదే నటన వృత్తిలోని అసలైన ప్రత్యేకత అని ఆమె అన్నారు.
Read Also : పర్యాటక రంగానికి ‘డిజిటల్’ బూస్టర్.. తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
బయటివారికి ఏ వృత్తి గురించి పూర్తిగా తెలియదని, నటుల విషయంలో కూడా అదే వర్తిస్తుందని పేర్కొన్నారు. “ఈరోజు ఒక లాయర్‌ను అడిగితే సినిమా సెట్స్‌లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవచ్చు. అలాగే, మాకు కూడా కోర్టులో అసలు వ్యవహారాలు ఎలా సాగుతాయో పూర్తిగా తెలియదు. కోర్టులో ప్రత్యక్షంగా ఉండకపోతే అక్కడి ప్రొసీడింగ్స్, ఒక కేసు కోసం ఎంతమంది పని చేస్తారు, ఎంత ప్రిపరేషన్ జరుగుతుంది అన్నది అర్థం కాదు” అని సోనాక్షి తెలిపారు. ప్రతి పాత్ర కొత్త అనుభవాన్ని ఇస్తుందని, నటులుగా ఆ అనుభవాలను తెరపై చూపించే అవకాశం తమకు దక్కుతుందని చెప్పారు. “ప్రేక్షకులు కూడా మా పాత్రల ద్వారా కొత్త ప్రపంచాలను చూస్తారు. అదే మా వృత్తిలో చాలా ఆసక్తికరమైన అంశం” అని పేర్కొన్నారు. ‘సిస్టమ్’ సినిమాలో సోనాక్షి సిన్హా లాయర్ పాత్రలో కనిపించగా, జ్యోతిక స్టెనోగ్రాఫర్ పాత్ర పోషించారు. కోర్టు నేపథ్యంలో సాగే ఈ కథలో సోనాక్షి ‘నేహా’ అనే యువ న్యాయవాదిగా నటించారు. తన తండ్రి నిర్వహిస్తున్న లా ఫర్మ్‌లో భాగస్వామ్యం సంపాదించుకోవడానికి ఆమె ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ సినిమా కథ నడుస్తుంది.
సోనాక్షి తండ్రి పాత్రలో దర్శకుడు, నటుడు అశుతోష్ గోవారికర్ కనిపించారు. కుటుంబ అంచనాలు, వృత్తిపరమైన ఒత్తిడులు, కోర్టు వ్యవస్థలో జరిగే పరిణామాలను కలిపి దర్శకుడు కథను అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో లాయర్ పాత్ర చేయడం సోనాక్షి కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం. పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా ప్రిపరేషన్ చేసినట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కోర్టు సన్నివేశాల్లో ఆమె నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ‘కకుడా’ తర్వాత సోనాక్షి నటించిన రెండో ఓటీటీ చిత్రం ఇదే. గత కొంతకాలంగా ఆమె వరుసగా విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా ప్రధాన కథల్లో నటించడానికి ఆమె ఆసక్తి చూపుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. పమ్మీ బవేజా, హర్మన్ బవేజా, స్మితా బాలిగా నిర్మించిన ‘సిస్టమ్’ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం గమనార్హం.
Read Also : ఎంజేపీ గురుకులాలకు ‘బ్రాండ్ ఇమేజ్’ తప్పనిసరి : మంత్రి పొన్నం ప్రభాకర్


