కేసీఆర్‌ను పాత వెయ్యినోటుతో పోల్చిన సీఎం రేవంత్‌..!

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలనలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) బీఆర్‌ఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, భూసేకరణ ఆలస్యం, పాలమూరు అభివృద్ధి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను పాత వెయ్యి నోటుతో పోల్చారు.

Revanth Reddy Slams BRS Over Irrigation Projects, Alleges Massive Corruption in Telangana

CM Revanth Reddy | బీఆర్ఎస్ నేత‌ల వ్యాఖ్యలకు పైసా విలువ లేద‌ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను రద్దయిన వెయ్యి రూపాయల నోటుతో పోలుస్తూ.. బీఆర్‌ఎస్ పార్టీకి గతమే ఉంది తప్ప భవిష్యత్తు లేద‌న్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా రెండో రోజు ఆయన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం కరివెన రిజర్వాయర్‌ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు తప్ప జిల్లాలోని మిగతా అన్ని సాగునీటి పథకాలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. భూసేకరణ దశలోనే పనులు నిలిచిపోయాయని, పంపులు–లిఫ్ట్‌ల వంటి కీలక పనుల్లో అవినీతి ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. ఈ వ్యవస్థపై మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి సంవత్సరాలుగా పోరాటం చేశారని కూడా ఆయన అన్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ పర్యటిస్తూ పెండింగ్‌ పనులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం..

తాము పనులు ప్రారంభిస్తే ప్రతిపక్షం రాజకీయ కార్యక్రమాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించానని, భవిష్యత్‌ చర్యలపై సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, కష్టకాలంలో పాలమూరు ప్రాంతం నుంచి కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించినా అభివృద్ధి జరగలేదని అన్నారు. కృష్ణా జలాలు జిల్లాలో ప్రవహించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని ఆశించినా, వాస్తవంలో పరిస్థితి మారలేదని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే సుమారు 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సిందని ఆయన పేర్కొన్నారు. దాదాపు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా పనులు పూర్తి కాలేదని, కమిషన్ల వ్యవస్థ వల్లే ప్రాజెక్టులు గమ్యం చేరలేదని ఆరోపించారు. భూసేకరణనే పూర్తిగా పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టులు ముందుకు కదలలేదని అన్నారు. “పనుల ఖర్చు చూపించారు కానీ నీరు మాత్రం ఒక్క ఎకరాకు కూడా రాలేదు” అని వ్యాఖ్యానించారు.

రూ.22వేల‌కోట్లు చెల్లించాం

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.22 వేల కోట్ల మేర సాగునీటి రంగానికి ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాకే రూ.8 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కనీసం 4 వేల ఎకరాల భూసేకరణ అవసరమని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్రక్రియ లేకుండా రిజర్వాయర్లు నింపడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. రెండు సంవత్సరాల్లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, అయితే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న భారీ అప్పుల కారణంగా కొత్తగా నిధుల సమీకరణ కష్టమవుతోందని ఆయన అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా రూ.55 వేల కోట్లు కాగా, సగం నిధులు కూడా ఖర్చు చేయకుండానే పనులు పూర్తయ్యాయన్న వాదన తర్కానికి నిలబడదని చెప్పారు. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వ్యక్తిగత కోపంతోనే కేసీఆర్ నిలిపివేశారని ఆయన ఆరోపించారు. ఇది ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే చర్యగా మారిందని విమర్శించారు.

రికార్డు లేదు..

బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, అవి ప్రజల్లో ప్రభావం చూపలేవని సీఎం వ్యాఖ్యానించారు. పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని, అవసరమైతే భూసేకరణకు అదనపు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కర్ణాటకతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేస్తామని, బ్రిడ్జ్‌ కమ్‌ బ్యారేజీలపై అధ్యయనం కొనసాగుతోందని వివరించారు. ప్రాజెక్టుల పనులకు అడ్డంకులు సృష్టించవద్దని బీఆర్‌ఎస్‌ నేతలకు ఆయన సూచించారు. గత ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, కేసీఆర్‌ను రద్దయిన వెయ్యి రూపాయల నోటుతో పోల్చారు. బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదని, గత పాలన తప్ప చెప్పుకోదగిన రికార్డు కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »