MMTS | హైదరాబాద్ నగర ప్రజలకు ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్) రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ యోచనకు కేంద్ర రైల్వే బోర్డు అడ్డుకట్ట వేసింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవలు భారీ ఆర్థిక భారంతో నడుస్తున్న నేపథ్యంలో ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే, ఇప్పటికే వస్తున్న నష్టాలతో పాటు భవిష్యత్తులో కలిగే అదనపు వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించాలని షరతులు విధించింది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అధికారికంగా లేఖ అందింది. ఆ లేఖను అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ లేఖలో ఎంఎంటీఎస్ నిర్వహణ వ్యయం, ఆదాయం మధ్య భారీ అంతరం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో టికెట్ ఆదాయాన్ని పూర్తిగా వదులుకోవడం రైల్వేలకు మరింత భారం అవుతుందని పేర్కొంది.
రూ.162 కోట్లకు పైగా వార్షిక నష్టం..
రైల్వే బోర్డు లెక్కల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంఎంటీఎస్ సేవల నిర్వహణకు సుమారు రూ.179 కోట్లు ఖర్చు కాగా, ప్రయాణికుల నుంచి వచ్చిన ఆదాయం కేవలం రూ.16.81 కోట్లే. అంటే ఒక్క ఏడాదిలోనే రూ.162 కోట్లకుపైగా నష్టం నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు, ఎంఎంటీఎస్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా బకాయిలు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని రైల్వే బోర్డు గుర్తు చేసింది. ఈ బకాయిల మొత్తం రూ.490 కోట్లకు మించిందని పేర్కొంటూ, ముందుగా వాటిని చెల్లించాలని సూచించింది.
రాష్ట్రం ప్రతిపాదించింది ఏమిటి?
ప్రస్తుతం ప్రయాణికుల నుంచి టికెట్ల రూపంలో వస్తున్న ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భర్తీ చేస్తుందని, జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ అంశంపై ముసాయిదా అవగాహన ఒప్పందం (MoU) రూపొందించి రైల్వే బోర్డు పరిశీలనకు పంపించింది. అయితే, ఆ ప్రతిపాదనను సమీక్షించిన బోర్డు, పూర్తి ఆర్థిక హామీ లేకుండా ముందుకు వెళ్లలేమని తేల్చిచెప్పింది. ఇటీవల హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థపై సమీక్షలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ, ఎంఎంటీఎస్ అభివృద్ధి వంటి అంశాలపై త్వరలో ఢిల్లీ వెళ్లే అవకాశమున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ సమయంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదనపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం.
తగ్గుతున్న ప్రయాణికుల సంఖ్యపై ఆందోళన
ఈ ఏడాది మార్చిలో ఎంఎంటీఎస్ సేవలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రయాణికుల సంఖ్య ఎందుకు తగ్గుతోందనే అంశంపై అధికారులను ప్రశ్నించారు. పీక్ అవర్స్‌లో రైళ్ల సంఖ్య పెంచడం, సమయపాలన మెరుగుపరచడం, స్టేషన్లకు చివరి మైలు కనెక్టివిటీ కల్పించడం వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్లకు ఆర్టీసీ బస్సుల అనుసంధానం లేకపోవడం కూడా ప్రయాణికుల తగ్గుదలకు ఒక కారణంగా అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య గత కొన్నేళ్లుగా హెచ్చుతగ్గులు చూస్తోంది. కోవిడ్‌కు ముందు రోజుకు లక్షకుపైగా ప్రయాణికులు ఉపయోగించేవారని రైల్వే వర్గాలు చెబుతుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గినట్లుగా తెలుస్తోంది. ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఉచిత ప్రయాణం వల్ల లాభమా? భారమా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం అమలైతే మొదట్లో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే నష్టాల్లో ఉన్న వ్యవస్థకు అదనపు ఆర్థిక భారం తప్పదని చెబుతున్నారు. మరోవైపు, సేవల ఫ్రీక్వెన్సీ పెంపు, స్టేషన్ల వద్ద మౌలిక సదుపాయాల మెరుగుదల, మెట్రో-బస్-ఎంఎంటీఎస్ మధ్య సమన్వయం పెంచితే ప్రయాణికుల సంఖ్య సహజంగానే పెరిగే అవకాశం ఉందని రవాణా నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ భవిష్యత్తు తెలంగాణ ప్రభుత్వం, రైల్వే బోర్డు మధ్య జరగబోయే చర్చలపై ఆధారపడి ఉంది. ఉచిత ప్రయాణ పథకానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? లేక రాష్ట్రం కొత్త ఆర్థిక ప్రతిపాదనతో ముందుకు వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.


