Nara Lokesh | రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సు (SPIEF) వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను ప్రపంచ వ్యాపారవేత్తల ముందుంచారు. కేవలం పెట్టుబడులు పెట్టడానికే కాకుండా, ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములుగా నిలవాలని రష్యాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థలకు ఆయన ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్.. భారత్-రష్యా సంబంధాలు వ్యాపార లావాదేవీలకే పరిమితం కావని, దశాబ్దాలుగా కొనసాగుతున్న విశ్వాసం, సహకారం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నారు. భిలాయ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం నుంచి భారత అంతరిక్ష రంగానికి అందించిన సహకారం వరకు అనేక కీలక సందర్భాల్లో రష్యా భారత్‌కు మిత్రదేశంగా అండగా నిలిచిందని గుర్తు చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్దేశించుకున్న 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్రంగా ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక విధానాలు అమలు చేస్తోందని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం వేగవంతమైన ఆర్థిక పురోగతిని నమోదు చేస్తోందని లోకేష్ తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2.5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలనే మహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ లక్ష్య సాధనకు పరిశ్రమలు, సాంకేతిక రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. రాష్ట్రానికి ఉన్న భౌగోళిక, పారిశ్రామిక బలాలను కూడా ఆయన ప్రస్తావించారు. దాదాపు వెయ్యి కిలోమీటర్ల పొడవైన తీరరేఖ, ఆరు ప్రధాన ఓడరేవులు, విస్తృత రహదారి-రైల్వే నెట్‌వర్క్, విశ్వసనీయ విద్యుత్ సరఫరా వంటి అంశాలు పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు. వ్యాపార అనుమతులు, పారిశ్రామిక కార్యకలాపాల్లో వేగానికి ప్రాధాన్యం ఇస్తూ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
అంతరిక్ష రంగంలో భారత్-రష్యా సహకారం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని లోకేష్ పేర్కొన్నారు. భారతదేశంలోని ఏకైక స్పేస్‌పోర్ట్ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటం రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న స్పేస్ సిటీల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కోస్మోస్‌తో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ఏరోస్పేస్, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, అధునాతన తయారీ రంగాల్లో రష్యన్ కంపెనీలకు విశాల అవకాశాలు ఉన్నాయని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు, నైపుణ్యాల సమన్వయంతో ఇరు దేశాలు కలిసి కొత్త అభివృద్ధి అధ్యాయాన్ని ప్రారంభించగలవని పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా పరిగణించాలని లోకేష్ కోరారు.


