తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. కరెంట్ బిల్లుల్లో ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజల నుంచి ఏకంగా రూ.5,420 కోట్లు వసూలు చేసుకునేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి డిస్కమ్‌లకు అనుమతి మంజూరు చేసింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వినియోగదారులు వాడిన కరెంట్ యూనిట్ల లెక్కల ఆధారంగా ఈ అదనపు చార్జీలను లెక్కించనున్నారు.
వచ్చే నవంబర్ నెల బిల్లులో ప్రతి యూనిట్‌కు అదనంగా 30 పైసల చొప్పున వసూలు చేయనున్నారు. డిసెంబర్ నెల నుంచి దీనిని యూనిట్‌కు 50 పైసలకు పెంచి వసూలు చేయనున్నారు. అయితే వ్యవసాయ రంగానికి పడే అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.
తెలంగాణలో విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.5,420.23 కోట్ల ట్రూ అప్ చార్జీల వసూలుకు డిస్కమ్‌లకు అనుమతిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీ ఈఆర్సీ) సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
2022-23లో విద్యుత్ కొనుగోలుకు అదనంగా వెచ్చించిన సొమ్ముకు, 2023-24కు సంబంధించిన రెవెన్యూ లోటును కలిపి ట్రూ అప్ పేరుతో మొత్తం రూ.7,635.22 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ 2025 నవంబర్ 10న రెండు డిస్కమ్‌లు ఈఆర్సీలో పిటిషన్లు దాఖలు చేశాయి.
వీటిపై బహిరంగ విచారణ నిర్వహించిన అనంతరం.. ఇందులో వ్యవసాయానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నుంచే తీసుకోవాలని ఈఆర్సీ తెలిపింది. మిగిలిన రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర కనెక్షన్ల వినియోగదారుల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది.
అయితే రైతు డిస్కం ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్లను కొంతకాలం పెండింగ్‌లో పెట్టాలని ప్రభుత్వం గత మార్చిలో ఈఆర్సీని కోరింది. దాంతో వీటిపై ఉత్తర్వులు ఇవ్వకుండా ఆపేసిన ఈఆర్సీ.. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం తాజాగా తుది ఆదేశాలు జారీ చేసింది.
నవంబర్ నుంచి ట్రూ అప్ చార్జీలు
ట్రూ అప్ చార్జీల వసూలు వచ్చే నెల నుంచి జారీ చేసే కరెంట్ బిల్లుల నుంచే ప్రారంభించాలని డిస్కమ్‌లకు ఈఆర్సీ ఆదేశించింది. 2022-23, 2023-24లో ప్రతి కనెక్షన్‌కు ఎన్ని యూనిట్లు వాడారో పరిశీలించి.. మొదటి నెల అంటే నవంబర్ బిల్లులో యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాత నెల నుంచి 50 పైసల చొప్పున వసూలు చేయాలి.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని వినియోగదారుల నుంచి వచ్చే 29 నెలల పాటు, ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో రాబోయే 26 నెలల పాటు ఈ చార్జీలను వసూలు చేయాలి. సాధారణ కరెంట్ బిల్లుకు ఇది అదనంగా వసూలు చేయనున్నందున వినియోగదారులపై కొంత ఆర్థిక భారం తప్పదు.
వ్యవసాయ కనెక్షన్లకు ప్రభుత్వం చెల్లింపు
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విధానం అమలవుతున్న నేపథ్యంలో వ్యవసాయ కనెక్షన్ల వినియోగదారులపై నేరుగా ట్రూ అప్ చార్జ్ విధించలేదు. వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలని డిస్కమ్‌లకు ఈఆర్సీ తెలిపింది.
బిల్లులో ప్రత్యేకంగా చూపించాలి
ట్రూ అప్ చార్జీగా ఎంత వసూలు చేస్తున్నారో ప్రతి నెల జారీ చేసే కరెంట్ బిల్లులో ప్రత్యేకంగా చూపాలని ఈఆర్సీ ఆదేశించింది. అది ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదో, నెలవారీ వినియోగ పరిమాణం, వర్తించిన యూనిట్ రేట్‌ను కూడా బిల్లులో స్పష్టంగా పేర్కొనాలి. ఇతర చార్జీలతో ఈ ట్రూ అప్‌ను కలపకూడదని కమిషన్ స్పష్టం చేసింది.
ట్రూ అప్ చార్జ్ అంటే ఏమిటి?
ప్రతి ఆర్థిక సంవత్సరంలో డిస్కమ్‌లు ఎంత కరెంట్ కొనాలి, వినియోగదారుల నుంచి ఎంత రెవెన్యూ వస్తుందనే అంచనాలను ఈఆర్సీ ప్రతి ఏడాది మార్చిలో ఆమోదించి ఉత్తర్వులు ఇస్తుంది. కరెంట్ కొనుగోలుకు అంచనాలకు మించి ఖర్చు కావడం లేదా రెవెన్యూ రాబడి అంచనాల కంటే తక్కువగా రావడం వల్ల ఏర్పడే లోటును పూడ్చుకునే ప్రక్రియలో భాగంగా వసూలు చేసే చార్జీలను ట్రూ అప్ చార్జీలుగా పిలుస్తారు.
ఇలా 2022-23లో విద్యుత్ కొనుగోలుకు అదనంగా వెచ్చించిన సొమ్మును, 2023-24 రెవెన్యూ లోటును కలిపి ట్రూ అప్ చార్జీల పేరుతో వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు.

