ఖమ్మంలో శ్రీవారి దివ్యధామం.. రూ.200 కోట్ల ఆలయానికి రేపే భూమిపూజ!

ఖమ్మం అల్లిపురంలో శ్రీవారి దివ్యధామ నిర్మాణానికి రేపు భూమిపూజ జరగనుంది. సుమారు 20 ఎకరాల్లో రూ.200 కోట్ల వ్యయంతో టీటీడీ సహకారంతో ఆలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Khammam Sri Venkateswara Temple Bhoomi Pooja
Khammam Sri Venkateswara Temple Bhoomi Pooja

ఖమ్మం నగరం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. వీధి వీధిన శ్రీవారి నామస్మరణ మార్మోగుతోంది. వాడవాడలా ఆహ్వాన తోరణాలు, చూపు తిప్పుకోనివ్వని భారీ ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అడుగడుగునా గోవింద నామస్మరణతో ఖమ్మం నగరం పులకించిపోతోంది.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అల్లిపురంలో శ్రీవారి దివ్యధామ నిర్మాణానికి రేపు భూమిపూజ మహోత్సవం జరగనుంది. దాదాపు రూ.200 కోట్ల రూపాయల వ్యయంతో, టీటీడీ సహాయ సహకారాలతో సుమారు 20 ఎకరాల విశాల ప్రాంగణంలో ఈ మహా ఆలయం రూపుదిద్దుకోబోతోంది.

తిరుమల ఆనంద నిలయాన్ని తలపించేలా నిర్మితం కానున్న ఈ దివ్య క్షేత్రం ఖమ్మం ఆధ్యాత్మిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.

భూమిపూజకు ముస్తాబైన ఖమ్మం

శ్రీవారి ఆలయ భూమిపూజను పురస్కరించుకొని ఖమ్మం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాన కూడళ్లు, రహదారులు స్వాగత తోరణాలతో కళకళలాడుతున్నాయి. భారీ హోల్డింగ్‌లు, రంగురంగుల ఫ్లెక్సీలు, ప్రత్యేక కటౌట్‌లతో నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది.

భూమిపూజకు విచ్చేస్తున్న త్రిదండి శ్రీ రామనారాయణ రామానుజ చినజీయర్ స్వామివారికి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి స్వాగతం పలుకుతూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా భక్తులకు ఆహ్వాన పత్రికలు అందాయి.

శ్రీవారి ఆలయ నిర్మాణానికి తొలి అడుగు పడుతున్న వేళ ఖమ్మం నగరం భక్తి భావంతో పొంగుతోంది.

తుది దశకు ఏర్పాట్లు

అల్లిపురంలో భూమిపూజ మహోత్సవానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా పర్యవేక్షించారు.

ఈ మహాకార్యానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాల సహకారంతో ఖమ్మంలో శ్రీవారి దివ్యధామం నిర్మాణానికి మార్గం సుగమమైందని తెలిపారు.

భక్తులకు అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం

భూమిపూజకు తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందించనున్నారు.

భూమిపూజ అనంతరం చినజీయర్ స్వామివారి అనుగ్రహ భాషణ కార్యక్రమం జరగనుంది. ఈ మహోత్సవంలో ఖమ్మం పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

ఖమ్మంలో మరో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా..

భద్రాద్రి రామయ్య కొలువైన నేలపై ఇప్పుడు కలియుగ దైవం శ్రీనివాసుడి దివ్యధామం కొలువు తీరబోతోంది. తిరుమల క్షేత్రాన్ని తలపించేలా నిర్మితం కానున్న ఈ ఆలయం భవిష్యత్తులో ఖమ్మం ప్రాంతానికి మరో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవనుంది.

ఆలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు.

శ్రీవారి ఆలయానికి భూమిపూజ ఒక నిర్మాణానికి శంకుస్థాపన మాత్రమే కాదు.. ఖమ్మం ప్రజల ఆధ్యాత్మిక ఆకాంక్షలకు సహకారం, భక్తుల చిరకాల వాంఛకు తొలి అడుగు. గోవింద నామస్మరణతో మార్మోగనున్న అల్లిపురం, భక్తి పారవశ్యంతో పులకించనున్న ఖమ్మం నగరం.. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యధామ నిర్మాణంతో ఖమ్మం ఆధ్యాత్మిక వైభవంలో మరో మైలురాయిని అందుకోబోతోంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »