Harish Rao: పులి డైలాగులు పక్కన పెట్టి.. పాలమూరుకు నీళ్లు ఇయ్యి: రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

Harish Rao: పాలమూరుకు నీళ్లు ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. పులి డైలాగులు పక్కన పెట్టి నీళ్లు ఎత్తాలని, దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Harish Rao Comments
Harish Rao Comments

తెలంగాణలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు, వరంగల్ ప్రాంతాలకు నీటిని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు’

రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని తాను గత మూడు, నాలుగు నెలలుగా చెబుతున్నానన్నారు.

ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తొమ్మిది నెలలుగా శాస్త్రవేత్తలు, రైతులు, ప్రతిపక్షాలు హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం ఎల్‌నినో పేరుతో ప్రభుత్వం చేతులెత్తేస్తోందని విమర్శించారు.

రిజర్వాయర్లలో నీళ్లు లేకపోవడం, పంటలకు నీరు అందించలేని పరిస్థితి ఏర్పడటం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు.

దేవాదులపై హరీశ్ రావు ప్రశ్నలు

దేవాదుల ప్రాజెక్టులో పది మోటార్లు నడపాల్సిన చోట కేవలం మూడు మోటార్లే ఎందుకు నడిపారని హరీశ్ రావు ప్రశ్నించారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిసినప్పుడు దేవాదుల మోటార్లను 24 గంటలు నడిపి వరంగల్ జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నింపాల్సిందని అన్నారు.

మోటార్లు 24 గంటలు నడిపి ఉంటే వరంగల్ జిల్లాకు కరువు పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. సమ్మక్క బ్యారేజీని నిర్మించడం ద్వారా కరువు కాలంలో ఏడాదికి 300 రోజుల పాటు దేవాదుల నుంచి నీటిని ఎత్తుకునే అవకాశం కల్పించామని చెప్పారు.

తెలంగాణ నీటిని వదిలిపెడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ, ఇతర మార్గాల ద్వారా నీటిని వినియోగించుకుంటోందని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం తక్కువగా నమోదైనా అక్కడ పంటలు పండుతున్నాయని, తెలంగాణలో మాత్రం కరువు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.

‘పాలమూరు బిడ్డ అని డైలాగులు కొట్టడం కాదు’

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపైనా హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీశైలంలో నీళ్లు ఉన్నప్పటికీ కల్వకుర్తి మోటార్లను సకాలంలో ఎందుకు ఆన్ చేయలేదని నిలదీశారు.

కల్వకుర్తిలో ఐదు మోటార్లు ఉండగా మూడు మోటార్లే నడిపారని, 24 గంటలు నడపాల్సిన మోటార్లను ఎనిమిది, తొమ్మిది గంటలకే పరిమితం చేశారని ఆరోపించారు. 35 టీఎంసీల నీటిని ఎత్తుకునే అవకాశం ఉన్న చోట కేవలం 13 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తి మిగతా నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వదిలేశారని అన్నారు.

‘పాలమూరు పులి’, ‘పాలమూరు బిడ్డ’ అంటూ డైలాగులు చెప్పడం కాదని, నీటిని ఎత్తి పాలమూరు ప్రజలకు అందించాలని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మాటలతో కడుపులు నిండవని, నీటిని అందిస్తేనే పాలమూరు ప్రజల కడుపులు నిండుతాయని అన్నారు.

కన్నెపల్లి మోటార్లపై కూడా విమర్శలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి మోటార్లను నడపకపోవడంపైనా హరీశ్ రావు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కన్నెపల్లికి వెళ్లి మోటార్లు నడపాలని డిమాండ్ చేశారని తెలిపారు.

ఎన్‌డీఎస్ఏ పేరుతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు. ఎన్‌డీఎస్ఏ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నీటిని ఎత్తుకోవచ్చని చెప్పిందని హరీశ్ రావు పేర్కొన్నారు.

పుణేలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను పరిశీలించి అవి సరిగానే ఉన్నాయని చెప్పిందని ఆయన అన్నారు. కన్నెపల్లిలో కట్టును కొత్తగా నిర్మిస్తే నీటిని ఎత్తుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రాజకీయ కారణాలతో మోటార్లను నడపడం లేదని ఆరోపించారు.

అఖిలపక్ష సమావేశానికి రావాలని సవాల్

నీటి ఎత్తిపోతల విషయంలో ప్రభుత్వం చేసిన వైఫల్యాలను నిరూపించేందుకు అఖిలపక్షంతో కలిసి ప్రాజెక్టులను సందర్శించేందుకు సిద్ధంగా ఉన్నానని హరీశ్ రావు అన్నారు.

దేవాదుల వద్ద ఎన్ని మోటార్లు నడిపారు, ఎన్ని గంటలు నడిపారు, ఎంత నీటిని ఎత్తారు అనే వివరాలను చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అదే విధంగా కల్వకుర్తికి వెళ్లి మోటార్ల పనితీరును పరిశీలిద్దామని సవాల్ చేశారు.

బనకచర్లపై రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీశ్ రావు

బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గతంలోనే హెచ్చరించిందని హరీశ్ రావు అన్నారు. తాము ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వం వ్యతిరేక లేఖ రాసిందని, కానీ ఇప్పుడు తెలంగాణ నీటి హక్కులకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని ఆరోపించారు.

‘గురుదక్షిణ’ పేరుతో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయవద్దని వ్యాఖ్యానించారు. తెలంగాణ జాతికి చేస్తున్న ద్రోహాన్ని తరతరాలు క్షమించవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు లేఖపై స్పందించలేదని ఆరోపణ

గోదావరి జలాల తరలింపు అంశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాశారని హరీశ్ రావు తెలిపారు. ఈ నెల 7న చంద్రబాబు లేఖ రాయగా, 13న నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (NWDA) సమావేశం ఏర్పాటు చేసిందని అన్నారు.

చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణకు సంబంధించిన నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

గోదావరి జలాల తరలింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, తెలంగాణకు నష్టం కలిగించే నిర్ణయాలను అడ్డుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »