- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- మహిళా సంఘాల ద్వారా మరో 3,000 RTC బస్సులు అందించనున్నట్లు ప్రకటన
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో
తెలంగాణలో మహిళా సాధికారతకు ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. స్వయం సహాయక సంఘాల (SHGs) ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా మహిళా శక్తి పథకాన్ని విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం మహిళా సంఘాల యాజమాన్యంలో కొనుగోలు చేసిన 553 బస్సులను టీజీఎస్ఆర్టీసీకి అప్పగించిన నేపథ్యంలో, రానున్న రోజుల్లో మరో 3,000 బస్సులను కూడా మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన RTCకి అందజేస్తామని వెల్లడించారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం కింద నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో పాల్గొన్న సీఎం, మహిళా శక్తి పథకంలో భాగంగా నడుస్తున్న కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా 553 బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన ఆయన, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, ఈ సంఖ్యను కోటి మందికి పెంచాలని పిలుపునిచ్చారు. “కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించను” అని స్పష్టం చేశారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి మహిళా సంఘాలు బస్సులు కొనుగోలు చేసి RTCకి అద్దెకు ఇచ్చే విధానాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు.
మహిళల ఆదాయ వనరులను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుందని సీఎం చెప్పారు. మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వహణ, స్త్రీ శక్తి భవనాల నిర్మాణం వంటి కార్యక్రమాలను మహిళా సంఘాల చేతుల్లో పెట్టామని గుర్తుచేశారు. జిల్లా కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయిలో మహిలా శక్తి భవనాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణాల్లో కూడా లక్ష LIG, MIG ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. ఆ ఇళ్లను కూడా మహిళల పేర్లపైనే కేటాయిస్తామని స్పష్టం చేశారు. “ఆస్తి ఏదైనా ఉంటే అది ఆడబిడ్డల పేరునే ఉండాలి” అనే తన ప్రభుత్వ విధానాన్ని మరోసారి వెల్లడించారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఇప్పటివరకు ప్రభుత్వం RTCకి రూ.10 వేల కోట్లకు పైగా చెల్లించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా కోట్లాది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో కూడా మహిళా సంఘాల పాత్రను మరింత పెంచాలని సీఎం సూచించారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటల సాగుపై దృష్టి పెట్టాలని, పంటల మార్పిడి అవసరమని చెప్పారు. ఈ విషయంలో మహిళా సంఘాలు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.
ఇక స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం భారీగా ఆర్థిక మద్దతు అందిస్తోందని పేర్కొన్న సీఎం, ఇప్పటివరకు రూ.61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ అందించామని, సున్నా వడ్డీ పథకం కింద బ్యాంకులకు రూ.2 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా శక్తి, మహాలక్ష్మి పథకాల కింద వివిధ సమాఖ్యలకు చెక్కులను పంపిణీ చేశారు. RTCకి అప్పగించిన బస్సుల అద్దె రూపేణా వచ్చిన రూ.20.34 కోట్ల చెక్కుతో పాటు, ఉచిత ప్రయాణ పథకం ద్వారా ఆదా అయిన రూ.10,700 కోట్ల విలువను ప్రతిబింబించే పత్రాలు, వడ్డీ లేని రుణాల కింద రూ.500 కోట్ల చెక్కులను మహిళా సంఘాల ప్రతినిధులకు అందజేశారు.
మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల విస్తరణ, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణలో భాగస్వామ్యం కల్పించడం వంటి చర్యలతో తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు కొత్త నిర్వచనం ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళా శక్తి పథకం విజయవంతమైతే దేశానికి ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.


