తెలంగాణ పోలీస్ ఉద్యోగాలు.. ట్రాన్స్‌జెండర్లకు దరఖాస్తు కష్టాలు

TGPRB పోలీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే గడువు సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు దరఖాస్తు సమస్యలపై హైకోర్టును ఆశ్రయించారు.

తెలంగాణ ట్రాన్స్‌జెండర్ల హక్కుల పోరాటం
తెలంగాణ ట్రాన్స్‌జెండర్ల హక్కుల పోరాటం

Hyderabad : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ (TGPRB) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ 2026కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే చివరి గడువు సెప్టెంబర్ 16, 2026 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ఫారమ్‌లో తమకు ప్రత్యేక ఆప్షన్ లేకపోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దరఖాస్తు ఫారమ్‌లో రెండు ఆప్షన్లే

TGPRB ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో లింగం (Gender) కేటగిరీ కింద కేవలం “పురుషుడు” (Male), “స్త్రీ” (Female) అనే రెండు ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు.

ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు సరిపడే ఆప్షన్ లేకపోవడంతో, అందుబాటులో ఉన్న వాటిలో ఒకదాన్ని బలవంతంగా ఎంచుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా చేయడం తప్పుడు ప్రకటన చేసినట్లవుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు.

హైకోర్టును ఆశ్రయించిన పది మంది అభ్యర్థులు

ఈ సమస్యను సవాలు చేస్తూ తను శ్రీతో పాటు మరో తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోతే, అభ్యర్థుల నుంచి భౌతికంగా దరఖాస్తులు స్వీకరించి, వారికి రశీదు ఇవ్వాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది.

అయితే ఈ తాత్కాలిక ఉపశమనం కోర్టును ఆశ్రయించిన మొదటి పది మంది అభ్యర్థులకు మాత్రమే పరిమితం కావడంతో, మిగిలిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

మరో 30 మంది అభ్యర్థుల పిటిషన్

ఈ నేపథ్యంలో నిషా నాగరాజ్ నేతృత్వంలో మరో 30 మంది ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. దరఖాస్తు గడువు ముగిసేలోపు తమకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.

“మేము సమాజంలో అందరితో సమానమే, విద్యావంతులమే. అందరికీ పోలీస్ ఉద్యోగం రావాలని లేదు, కానీ దరఖాస్తు చేసుకుని పోటీ పడే అవకాశమైనా మాకు కల్పించాలి” అని దరఖాస్తుదారురాలు నిషా నాగరాజ్ తెలిపారు.

సెప్టెంబర్ 16తో ముగియనున్న గడువు

TGPRB Recruitment 2026కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే పొడిగించిన గడువు సెప్టెంబర్ 16, 2026 సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. వినాయక చవితి సెలవుల కారణంగా హైకోర్టు తిరిగి సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. దీంతో కొత్తగా పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థుల కేసును లిస్ట్ చేయించి, ఉత్తర్వులు పొందేందుకు చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.

దూరప్రాంత అభ్యర్థులకు అదనపు భారం

హైకోర్టు ఆదేశాల ప్రకారం భౌతిక దరఖాస్తులను హైదరాబాద్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలోనే సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి సుదూర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులకు ప్రయాణ ఖర్చులు, సమయం అదనపు భారంగా మారుతున్నాయని ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త విజయంతి వసంత మొగిలి తెలిపారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, దూరప్రాంతాల అభ్యర్థులకు సులభమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.

ప్రత్యేక కేటగిరీ, సమాంతర రిజర్వేషన్ల డిమాండ్

ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు కేవలం దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయాలని మాత్రమే కోరడం లేదు. పోలీస్ శాఖ సేవా నిబంధనల్లో మార్పులు చేసి, ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కేటగిరీతో పాటు సమాంతర రిజర్వేషన్లు (Horizontal Reservation) కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

అలాగే భవిష్యత్తులో నిర్వహించే శారీరక దారుఢ్య పరీక్షల ప్రమాణాలపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

ఉన్నత విద్య చదివినా అవకాశాల కోసం ఎదురుచూపులు

బీటెక్‌ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ప్రస్తుతం ట్రాఫిక్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నిషా నాగరాజ్ మాట్లాడుతూ.. తమ కమ్యూనిటీలో ఎంతో మంది యువత ఉన్నత చదువులు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

సమాజంలో కొందరు చేసే తప్పుల కారణంగా మొత్తం కమ్యూనిటీని తక్కువ చేసి చూడటం బాధాకరమని ఆమె అన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడం అన్యాయమని అభ్యర్థులు పేర్కొంటున్నారు.

ట్రాన్స్‌జెండర్లకు మద్దతుగా NALSAR విద్యార్థులు

మరోవైపు, నల్సార్ లా యూనివర్సిటీకి చెందిన 130 మందికి పైగా విద్యార్థులు ట్రాన్స్‌జెండర్ల హక్కులకు మద్దతుగా నిలిచారు. ఈ సమస్యపై స్పందించాలని కోరుతూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులకు లేఖలు పంపారు.

దరఖాస్తు గడువు సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటలకు ముగియనున్న నేపథ్యంలో, కొత్తగా పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ హక్కుల పోరాటంలో అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుందా లేదా అనేది త్వరలో తేలనుంది.

ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు వయోపరిమితిని మరో మూడు సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »