ఎన్నారై భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌.. సుపథం దర్శన గడువు 90 రోజులకు పెంపు!

ఎన్ఆర్ఐ భక్తులకు (NRI Devotees) తిరుమల దర్శనం (Tirumala Darshan) మరింత సులభం చేస్తూ టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. సుపథం ప్రత్యేక దర్శనం (Supradam Darshan) గడువును 90 రోజులకు పెంచడంతో పాటు, ఆపన్న హృదయ పథకం (Apanna Hrudaya Scheme) కింద దాతలకు ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం (VIP Break Darshan) సౌకర్యాన్ని కొనసాగిస్తోంది.

NRI Devotees Get More Flexibility as TTD Extends Supradam Darshan Validity

TTD | విదేశాల్లో స్థిరపడిన భక్తులకు శ్రీవారి దర్శనం మరింత సులభతరం చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్ఐలకు (Non-Resident Indians) సుపథం మార్గంలో అందించే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఉన్న గడువును 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది. ఈ కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు భారత్‌కు వచ్చిన ఎన్ఆర్ఐ భక్తులు 30 రోజుల్లోపే తిరుమలలోని సుపథం కౌంటర్ వద్ద తమ ఒరిజినల్ పాస్‌పోర్ట్, జిరాక్స్ ప్రతులతో హాజరై రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ పొందాల్సి వచ్చేది. తక్కువ గడువు కారణంగా ప్రయాణ షెడ్యూల్‌లో అనిశ్చితి ఉన్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తరుచూ ఫిర్యాదులు వస్తున్నాయి. సమస్యను పరిష్కరించాలంటూ వినతులు వస్తున్నాయి. ఈ సమస్యను పరిగణనలోకి తీసుకున్న టీటీడీ, గడువును మూడు నెలలకు పెంచుతూ వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయంతో విదేశాల నుంచి వచ్చే భక్తులు తమ భారత్‌ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకునే అవకాశం లభించనుంది. కుటుంబ సమేతంగా వచ్చే ఎన్ఆర్ఐలకు ఇది మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుందని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో సుపథం మార్గంలో భక్తుల రద్దీని కూడా సమతుల్యం చేయవచ్చని భావిస్తున్నారు.

Read Also : ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..! డైట్‌ ఛార్జీల పెంపు దిశగా ప్రభుత్వం అడుగులు..!

ఆపన్న హృదయ పథకానికి దాతల స్పందన

మరోవైపు టీటీడీ అమలు చేస్తున్న శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి దాతల నుంచి మంచి స్పందన కొనసాగుతోంది. ఆర్థికంగా వెనుకబడిన భక్తులకు సాయం చేయాలన్న లక్ష్యంతో ఈ ట్రస్టును ఏర్పాటు చేసిన టీటీడీ, విరాళాల ఆధారంగా ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ పథకం ప్రకారం, ఆపన్న హృదయ ట్రస్టుకు రూ.1 లక్ష విరాళంగా అందించిన దాతలకు, వారి కుటుంబ సభ్యులతో కలిపి ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. ఈ సదుపాయాన్ని పొందాలనుకునే వారు దర్శనానికి ఒకరోజు ముందే తిరుమలలోని దాతల విభాగంలో విరాళం చెల్లించాల్సి ఉంటుంది. విరాళం అనంతరం ఒక్కొక్కరికి రూ.500 చొప్పున మొత్తం ఐదుగురికి రూ.2,500 చెల్లించి బ్రేక్ దర్శన టికెట్లు పొందవచ్చు. తదుపరి రోజు సాయంత్రం 4 గంటలకు వారికి శ్రీవారి దర్శనం కల్పిస్తారు. ఈ ప్రక్రియ కోసం తిరుమలలోని దాతల విభాగంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు సేవలను మరింత సులభతరం చేయడం, అదే సమయంలో ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలను విస్తరించడమే ఈ మార్పుల లక్ష్యమని టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి.

Read Also : ఏపీకి మరో భారీ రైల్వే ప్రాజెక్టు.. విశాఖ-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు ప్రతిపాదన

ప్రయోగాత్మకంగా ‘శ్రీవారి వైద్యసేవ’

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనుబంధ ఆసుపత్రుల్లో ‘శ్రీవారి వైద్యసేవ’ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్‌ను తితిదే ఈవో ఎం. రవిచంద్ర ఆవిష్కరించారు. భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు మూడు రోజుల పాటు, ఎంబీబీఎస్ వైద్యులు ఏడు రోజుల పాటు టీటీడీ ఆసుపత్రుల్లో సేవలు అందించే అవకాశం కల్పించినట్లు వివరించారు. వారికి వసతి, భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. తిరుమల, తిరుపతిలోని అశ్విని, స్విమ్స్‌, బర్డ్‌, ఆయుర్వేద ఆసుపత్రి, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి వంటి అనుబంధ వైద్య సంస్థల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, వైద్యుల సూచనల ఆధారంగా మరింత మెరుగుపరచనున్నట్లు వివరించారు.

Read Also : జెన్ జీ అభిప్రాయాలను వెల్లడించేందుకు ‘సేనా గళం’.. ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »