Bullet Train | ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడలను అత్యాధునిక బుల్లెట్ రైలు మార్గంతో అనుసంధానించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు సాగిస్తున్నట్లు సంకేతాలున్నాయి. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరిగిన చర్చల్లో ఈ ప్రతిపాదనపై సానుకూల సంకేతాలు లభించాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మాధవ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే విశాఖపట్నం-విజయవాడ మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైనట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు అమలైతే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు వ్యాపార, పారిశ్రామిక రంగాలకు కూడా కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అభిప్రాయపడ్డారు.
Read Also : ఆంధ్రప్రదేశ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు: విజయనగరం ఘటనలో నలుగురు మృతి
ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు. జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా ఈ జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు మాధవ్ స్పష్టం చేశారు. ఈ జోన్ ఏర్పాటు కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీ పోరాటం సాగించిందని, ఇప్పుడు అది ఫలితాన్ని ఇస్తోందని అన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి విజయవాడకు రైలులో చేరుకోవడానికి సాధారణంగా ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతోంది. ప్రతిపాదిత బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి సుమారు గంటన్నరలోనే గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 350 కిలోమీటర్ల దూరాన్ని అత్యంత వేగంగా అధిగమించేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక ప్రణాళికల ప్రకారం.. బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉంది. భవిష్యత్తులో అవసరాలను బట్టి మరింత అధిక వేగంతో సేవలు అందించేలా సాంకేతిక ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హైస్పీడ్ రైలు మార్గం విజయవాడ నుంచి ఏలూరు, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలను కలుపుతూ విశాఖపట్నం వరకు విస్తరించే అవకాశాలు పరిశీలనలో ఉన్నాయి.
Read Also :విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన.. చంద్రబాబు ఫోన్‌పై ఆసక్తి చూపిన కేంద్రమంత్రి
ప్రాజెక్టుకు సంబంధించిన తుది స్థాన నిర్ధారణ సర్వే (ఫైనల్ లొకేషన్ సర్వే) నిర్వహణకు అవసరమైన అనుమతుల కోసం ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. సర్వే పూర్తయిన తర్వాత ప్రాజెక్టు వ్యయ అంచనాలు, భూసేకరణ అవసరాలు, నిర్మాణ దశలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్లలో ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే ప్రాధాన్యం లభిస్తుండగా, ఈ కొత్త ప్రతిపాదన రాష్ట్ర రైల్వే నెట్‌వర్క్‌కు మరింత బలం చేకూర్చనుంది. మరోవైపు విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటుపైనా కేంద్రం పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే రాష్ట్రంలోని పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు కొత్త ఊపు లభించడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడతాయని అభిప్రాయపడుతున్నారు.
Read Also : విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. వివాహితపై అత్యాచారం, నిందితుడి కోసం గాలింపు


