Diet Charges Hike | గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పబోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 6.52 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన పోషకాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలను దృష్టిలో ఉంచుకుని డైట్ ఛార్జీలను సవరించే ప్రతిపాదనపై ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఇటీవలే సంబంధిత శాఖల నుంచి నివేదికలు కోరిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రెండు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను సిద్ధం చేయించింది. డైట్ ఛార్జీలను 10 శాతం పెంచితే ఎంత భారం పడుతుంది, 15 శాతం పెంపుతో ఎంత అదనపు వ్యయం అవుతుందనే వివరాలను అధికారులు సమగ్రంగా సమర్పించారు. ఈ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. వారం, పది రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జూన్ లేదంటే జులై నెల నుంచి పెంపు అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Read Also : టాలీవుడ్‌కు ఏపీ నుంచే 75శాతం ఆదాయం.. బాలకృష్ట సంచలన వ్యాఖ్యలు..!
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, అలాగే ఆపై తరగతుల విద్యార్థులు కలిపి 6.52 లక్షల మంది వివిధ గురుకులాలు, వసతిగృహాలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరి భోజన ఖర్చుల కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.990 కోట్లు వెచ్చిస్తోంది. ప్రస్తుత విధానం ప్రకారం 3-4 తరగతుల విద్యార్థులకు నెలకు రూ.1,150, 5-10 తరగతుల వారికి రూ.1,400, ఇంటర్మీడియట్, ఆపై తరగతుల వారికి రూ.1,600 చొప్పున డైట్ ఛార్జీలు అందుతున్నాయి. వీటిని 10 శాతం పెంచితే ప్రభుత్వంపై అదనంగా రూ.99 కోట్ల భారం పడనుండగా, 15 శాతం పెంపుతో ఇది సుమారు రూ.148 కోట్ల వరకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో చివరిసారిగా డైట్ ఛార్జీలు 2023లో సవరించారు. అప్పటి నుంచి మూడేళ్ల కాలంలో నిత్యావసరాల ధరలు గణనీయంగా పెరగడంతో విద్యార్థుల భోజన నాణ్యతపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ సవరణ అవసరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : భానుడి ప్రతాపానికి జనం విలవిల.. తూగో జిల్లాలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..!
డైట్ ఛార్జీల పెంపు ప్రతిపాదన రూపొందించే సమయంలో అధికారులు మార్కెట్‌లో లభించే సుమారు 20 రకాల నిత్యావసరాల ధరలను, డీమార్ట్ ధరలను, అలాగే పౌర సరఫరాల శాఖ డేటాను ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే కాస్మెటిక్ మరియు ఇతర అదనపు ఛార్జీలపై మాత్రం ఈ దఫా ఎలాంటి మార్పులు ప్రతిపాదించలేదు. 2023లో అమలైన నిర్మాణాన్నే కొనసాగిస్తూ కేవలం భోజన భత్యాలపై మాత్రమే సవరణలు సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న తర్వాత, వేలాది మంది విద్యార్థులకు నేరుగా లబ్ధి కలగనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మెరుగైన ఆహార సదుపాయాలు అందే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also : భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుమల తరహాలోనే ప్రముఖ ఆలయాల్లోనూ సేవ భాగ్యం..


