DRDO | అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఇప్పటికే పలు జాతీయ స్థాయి సంస్థల దృష్టిని ఆకర్షిస్తున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీ (AQV)లో ఇప్పుడు రక్షణ రంగానికి చెందిన ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అడుగుపెట్టబోతున్నది. భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్‌డీవో పరిధిలో పనిచేసే నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL) ఇక్కడ ఆధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయించింది.సుమారు రూ.22.50 కోట్ల వ్యయంతో ఏర్పాటుకానున్న ఈ కేంద్రం ద్వారా నౌకాదళం, రక్షణ సాంకేతిక రంగాలకు అవసరమైన అత్యాధునిక క్వాంటమ్ ఆధారిత పరిశోధనలు చేపట్టనున్నారు. ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (Quantum Computational Fluid Dynamics – QCFD) అల్గారిథమ్స్ రూపకల్పన, హైబ్రిడ్ క్లాసికల్-క్వాంటమ్ వర్క్‌ఫ్లోస్ అభివృద్ధి, వాటి పరీక్షలు, ధ్రువీకరణ వంటి కీలక కార్యక్రమాలు ఈ కేంద్రంలో జరగనున్నాయి. రక్షణ రంగంలో సాంకేతిక సామర్థ్యాలను పెంచే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
Read Also : భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు..!
ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగంగా చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద ఎన్‌ఎస్‌టీఎల్‌కు 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లగ్ అండ్ ప్లే కార్యాలయ స్థలాన్ని కేటాయిస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో గన్నవరంలోని ‘మేధాటవర్స్’లో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. అనంతరం అమరావతిలో ప్రత్యేకంగా నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీ మౌలిక సదుపాయాలు సిద్ధమైన తర్వాత కేంద్రాన్ని అక్కడికి తరలించే ప్రణాళిక సిద్ధం చేశారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో అడుగుపెడుతున్న రెండో కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఎన్‌ఎస్‌టీఎల్ నిలవడం విశేషం. ఇప్పటికే కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) సంస్థ కూడా ఇక్కడ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Read Also : టీచర్ ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ టెక్నాలజీలకు సంబంధించిన ఇన్నోవేషన్ అండ్ స్కిల్లింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని భవిష్యత్ సాంకేతిక పరిశోధనలకు కేంద్రబిందువుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఇప్పుడు డీఆర్‌డీవో అనుబంధ సంస్థ రావడం ద్వారా అమరావతి క్వాంటమ్ వ్యాలీకి మరింత ప్రాధాన్యం పెరిగిందనే అభిప్రాయం టెక్నాలజీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Read Also : YS Jagan | ఆక్వా ఫీడ్ ధరల పెంపు రగడ.. ఏపీలో వైసీపీ-టీడీపీ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం..!


