ఏపీకి పెట్టుబడుల ప్రవాహం.. నెల్లూరులో రూ.3వేలకోట్లకుపైగా ఐఎఫ్‌ఎఫ్‌ పెట్టుబడి..

అమెరికాకు చెందిన ఫార్చ్యూన్‌-500 సంస్థ ఐఎఫ్‌ఎఫ్‌ (IFF) నెల్లూరు ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.3,153 కోట్లతో అమలు కానున్న ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో బయోటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, అనుబంధ పరిశ్రమల విస్తరణకు అవకాశాలు ఉండనున్నాయి.

IFFCO Nellore Kisan SEZ
IFFCO Nellore Kisan SEZ

IFF | ఏపీకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్‌ ఫ్లేవర్స్‌ అండ్‌ ఫ్రాగ్రెన్స్‌ (ఐఎఫ్‌ఎఫ్‌) రాష్ట్రంలో రూ.3,153 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఫ్లేవర్స్‌, సుగంధ ద్రవ్యాలు, బయోసైన్సెస్‌, ఆరోగ్య ఉత్పత్తులు, ఆహార పదార్థాల రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ సంస్థ రెండు దశల్లో ప్రాజెక్ట్‌ను విస్తరించనుంది. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం తొలి దశలో రూ.1,653 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నారు. 2028 సెప్టెంబరు నాటికి నిర్మాణ పనులు పూర్తిచేసి, 2031 సెప్టెంబరు నాటికి పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభించాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకెళ్తోంది.

Read Also : దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. జూన్‌ ఒకటి నుంచి స్పెషల్‌గా పెన్షన్లు..!

ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు..

ఈ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం మెగా ప్రాజెక్ట్‌ (Mega Project) కేటగిరీలో చేర్చి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. రెండో దశలో మరో రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 2032 జులై నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి, 2034 మార్చి నాటికి యంత్రాలను బిగించేందుకు ప్రతిపాదించారు. అదే ఏడాది సెప్టెంబరు నుంచి ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో రాష్ట్రంలో పరిశ్రమల ఎకోసిస్టమ్‌ (Ecosystem) మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీర్లు, బయోటెక్నాలజీ నిపుణులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్యాకేజింగ్‌, రవాణా, నిర్వహణ సేవలు, ముడిపదార్థాల సరఫరా వంటి రంగాల్లో చిన్న, మధ్య తరహా అనుబంధ పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. స్థానిక మార్కెట్‌ నుంచే ముడి పదార్థాల సేకరణ జరగనుండటంతో బయోటెక్‌ (Biotech), ఫుడ్‌ ప్రాసెసింగ్‌ (Food Processing) రంగాలకు కూడా ఊతం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also : ప్రభుత్వ వర్సిటీల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి అనుమతి..!

ఇప్పటికే శ్రీసిటీలో యూనిట్‌..

అమెరికాలో ప్రధాన కార్యాలయం కలిగిన ఐఎఫ్‌ఎఫ్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 150కు పైగా తయారీ కేంద్రాలను కలిగిన ఈ సంస్థకు ఇప్పటికే శ్రీసిటీలో ఒక యూనిట్‌ ఉంది. ఇప్పుడు నెల్లూరులోని ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో మరో తయారీ కేంద్రం కోసం 24.71 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ పెట్టుబడితో రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు సైతం క్యూ కట్టే అవకాశముందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read Also : తొలిసారిగా ఢిల్లీ రోడ్లపై హైడ్రోజన్‌ బస్సులు.. పర్యావరణ హిత రవాణాలో తొలి అడుగు..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »