తొలిసారిగా ఢిల్లీ రోడ్లపై హైడ్రోజన్‌ బస్సులు.. పర్యావరణ హిత రవాణాలో తొలి అడుగు..!

దేశ రాజధాని ఢిల్లీలో హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే బస్సులు (Hydrogen Powered Buses) ప్రారంభమయ్యాయి. డీఎంఆర్‌సీ (DMRC), ఇండియన్ ఆయిల్‌ (Indian Oil Corporation) భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ గ్రీన్ మొబిలిటీ (Green Mobility) ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు. పర్యావరణహిత ప్రజా రవాణాకు కొత్త దిశగా నిలుస్తోంది.

Hydrogen Bus | దేశ రాజధాని ఢిల్లీలో క్లీన్‌ ఎనర్జీ వినియోగం దిశగా మరో కీలక ముందడుగు పడింది. తొలిసారిగా హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే బస్సులు ప్రజారవాణాలోకి అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ (Indian Oil Corporation) రెండు ఆధునిక హైడ్రోజన్‌ బస్సులను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ (DMRC)కు అప్పగించింది. సెంట్రల్‌ విస్టా (Central Vista) ప్రాంతంలో ఈ హైడ్రోజన్‌ ఆధారిత షటిల్‌ బస్సు సేవలను ప్రారంభించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖతో పాటు పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నారు. పర్యావరణానికి మేలు చేసే ఆధునిక ప్రజా రవాణాను ప్రోత్సహించడం దీని వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. ఈ బస్సుల్లో జీపీఎస్‌ (GPS Tracking), సీసీటీవీ (CCTV System) వంటి సాంకేతిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. దీంతో బస్సుల కదలికలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించడంతో పాటు ప్రయాణికుల భద్రతను మెరుగుపరచనున్నారు.

Read Also : వాత మొదలైంది.. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.3 పెంపు..!

సోమవారం నుంచి శుక్రవారం వరకు, ప్రభుత్వ సెలవులు మినహా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, అలాగే మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 వరకు బస్సులు నడుస్తాయి. సెంట్రల్‌ సెక్రటేరియట్‌ (Central Secretariat), సేవాతీర్థ్‌ మెట్రో స్టేషన్ల మధ్య ఈ సేవలు నడవనున్నాయి. సెంట్రల్‌ విస్టా పరిధిలోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యంగా ఈ మార్గాన్ని రూపొందించారు. ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించేలా ప్రోత్సహించాలని అధికారులు భావిస్తున్నారు. కర్తవ్య భవన్‌ (Kartavya Bhawan), విజ్ఞాన్‌ భవన్‌ (Vigyan Bhawan), నిర్మాణ్‌ భవన్‌ (Nirman Bhawan), అక్బర్‌ రోడ్‌, బరోడా హౌస్‌ వంటి కీలక ప్రాంతాలతో పాటు ఇండియా గేట్‌ (India Gate), నేషనల్‌ స్టేడియం, నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడర్న్‌ ఆర్ట్స్‌ ఈ రూట్‌లో ఉంటాయి.

Read Also : పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మహర్దశ: పవన్ కళ్యాణ్ కృషితో రూ. 37.25 కోట్లు మంజూరు.. అమృత్ భారత్ పథకంలోకి చేరిక!

బస్సుల నిర్వహణ, టికెటింగ్‌, ప్రయాణికుల సహాయ బాధ్యతలను డీఎంఆర్‌సీ చూసుకుంటుంది. హైడ్రోజన్‌ ఇంధనం, డ్రైవర్ల బాధ్యతలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ చూసుకుంటుంది. ప్రతి అరగంటకు ఒక బస్సు సేవ అందుబాటులో ఉంటుంది. ఒకటి క్లాక్‌వైజ్‌, మరొకటి యాంటీ క్లాక్‌వైజ్‌ దిశలో నడుస్తాయి. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌ (NCMC), యూపీఐ (UPI), నగదు ద్వారా టికెట్‌ చెల్లింపులు చేయొచ్చు. ప్రయాణ దూరాన్ని బట్టి రూ.10, రూ.15 వరకు ఛార్జీని నిర్ణయించారు. పర్యావరణ హిత రవాణా వ్యవస్థల వైపు భారత్‌ వేగంగా అడుగులు వేస్తోందనడానికి ఈ ప్రాజెక్ట్‌ మరో ఉదాహరణగా నిలుస్తోంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా హైడ్రోజన్‌ ఆధారిత ప్రజా రవాణా వ్యవస్థలకు ఇది మార్గదర్శకంగా మారే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read Also : థ్యాంక్స్‌ సీఎం రేవంత్‌..! సీఎం రేవంత్‌ చిత్రపటానికి 2008 డీఎస్సీ టీచర్స్‌ పాలాభిషేకం..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »