డాలర్ రేటు పెరిగితే బంగారం ధర ఎందుకు మారుతుంది? పసిడి రేట్లను నిర్ణయించేది ఆ సంస్థేనా?

Gold and Silver: బంగారం ధరలు ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నది ఒక అపోహ. నిజానికి IBJA, అంతర్జాతీయ మార్కెట్లు, డాలర్ విలువ, దిగుమతి సుంకాలు కలిసి ప్రతిరోజూ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. పసిడి రేట్లు ఎలా నిర్ణయించబడతాయో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే.

Gold-and-Silver
Gold-and-Silver

Gold and Silver

హైదరాబాద్: సాధారణంగా సామాన్యులు బంగారం ధర పెరిగితే ప్రభుత్వం మీదో, లేదా రిజర్వ్ బ్యాంక్ మీదో నెపం వేస్తుంటారు. కానీ నిజానికి పసిడి ధరల నిర్ణయం వెనుక ఒక సంక్లిష్టమైన అంతర్జాతీయ సమీకరణం ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడం ఒక ఆనవాయితీ. అయితే, గత కొంతకాలంగా ఈ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ధరలను ఎవరు నియంత్రిస్తారు? ఏ ప్రాతిపదికన ప్రతిరోజూ రేట్లు మారుతుంటాయి? అనే విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

చాలామంది భావిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వానికో లేదా ఆర్బీఐ (RBI) కో ఈ ధరలను పెంచే లేదా తగ్గించే అధికారం నేరుగా ఉండదు. భారతదేశంలో బంగారం ధరలను నిర్ణయించడంలో ‘ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్’ (IBJA) అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థ దేశంలోని ప్రముఖ గోల్డ్ డీలర్ల దగ్గర నుండి కొనుగోలు, అమ్మకాల వివరాలను సేకరిస్తుంది. వారి కోట్స్ ఆధారంగా ఒక సగటు ‘బెంచ్ మార్క్’ ధరను ప్రతిరోజూ ఖరారు చేస్తుంది. దీనినే మనం రిటైల్ మార్కెట్‌లో ప్రామాణికంగా తీసుకుంటాం.

అయితే, ఈ ధరల వెనుక అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కూడా ఎంతో ఉంటుంది. భారత్ తన అవసరాలకు సరిపడా బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి, లండన్ లేదా న్యూయార్క్ వంటి అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ (సుమారు 31 గ్రాములు) బంగారం ధర ఎంత ఉందనేది కీలకం. వీటితో పాటు అమెరికా డాలర్‌తో పోల్చినప్పుడు భారత రూపాయి విలువ తగ్గినా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా ఆ ప్రభావం నేరుగా పసిడి ధరలపై పడుతుంది. వీటికి తోడు స్థానికంగా ఉండే దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చులు, వివిధ రకాల పన్నులు తోడై మనకు తుది ధరగా మారుతాయి. అందుకే, ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న ఆర్థిక మార్పు జరిగినా, అది మనం ఇష్టపడే బంగారం ధరలో మార్పుకు దారితీస్తుంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »