Monsoon | యావత్ రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమ ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) అధికారికంగా వెల్లడించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రుతుపవనాల ఆగమనం ఆలస్యమైంది. 2025లో మే 26న రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు, ఈ ఏడాది జూన్ తొలి వారంలో మాత్రమే ప్రవేశించాయి. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఈ సారి రైతులతో పాటు సాధారణ ప్రజల్లోనూ నైరుతి రుతుపవనాల ఆగమనంపై ఆసక్తి నెలకొంది.
Read Also : ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..! డైట్ ఛార్జీల పెంపు దిశగా ప్రభుత్వం అడుగులు..!
సాధారణం కంటే తక్కువగానే..
ఇదిలా ఉండగా, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల సీజన్‌కు సంబంధించి ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వర్షపాత అంచనాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయి కంటే కొంత తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రుతుపవనాల ప్రస్థానంలో మధ్య మధ్యలో విరామాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, కొన్ని రోజుల పాటు మంచి వర్షాలు కురిసిన తర్వాత మళ్లీ పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వివరించారు. అయితే, స్థానికంగా ఏర్పడే వాతావరణ మార్పులు, అల్పపీడనాలు వంటి వ్యవస్థల ప్రభావంతో కురిసే వర్షాలు ఈ లోటును కొంత మేర భర్తీ చేయవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు.
Read Also : త్వరలో అందుబాటులోకి భోగాపురం ఎయిర్‌పోర్ట్.. ఎలక్ట్రిక్ బసులు నడిపేందుకు ఆర్టీసీ ప్లాన్..!
ఒక్కో జిల్లాల్లో ఒక్కో రకంగా..
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, పోలవరం, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, కడప, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షాపాతం ఉంటుందని లెక్కలు వేశారు. ఇదిలా ఉండగా.. ఆది, సోమవారాల్లో కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు, ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Read Also : శ్రీశైలం ఘాట్‌లో ఎలివేటెడ్ కారిడార్.. వన్యప్రాణులపై వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌తో అధ్యయనం..
రెండురోజులు వర్షాలు..
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు, వర్షాల సూచనలు ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగనుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కోనసీమ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ఆదివారం 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పిడుగులు, ఉరుముల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఆశ్రయం పొందరాదని సూచించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నైరుతి రుతుపవనాల రాకతో వ్యవసాయ పనులు ఊపందుకునే అవకాశముండగా, రైతాంగం ఎన్నో ఆశలతో సాగుకు సన్నద్ధమవుతున్నారు.
Read Also : సడలింపులు ఇవ్వండి.. కేంద్రానికి చంద్రబాబు లేఖ..


